కొలంబో: శ్రీలంకలో వరుసపేలుళ్లకు పాల్పడి నరమేధం సృష్టించి 321 మందిని పొట్టనపెట్టుకుంది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు చెందిన వార్తా సంస్థ అమాక్ మంగళవారం ఈ విషయాన్ని అంగీకరిస్తూ ఓ ప్రకటన చేసింది. అయితే, తామే ఈ దాడికి పాల్పడినట్టుగా ప్రకటించిన ఐఎస్ఐఎస్.. అందుకు సంబంధించిన ఆధారాలను బహిర్గతం చేయలేదు. ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన ఈ దాడిలో 500 మందికిపైగా తీవ్రంగా గాయపడగా గాయపడిన వారిలో ఎంతో మంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని అధికారవర్గాలు వెల్లడించాయి. 


న్యూజీలాండ్‌లో మార్చి 15న శుక్రవారంనాడు ప్రార్థనలు జరిగే సమయంలో రెండు మసీదుల వద్ద కాల్పులకు పాల్పడిన ఓ యువకుడు ఆ దాడిలో 50 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నాడు. ఆ దాడికి ప్రతీకారంగానే శ్రీలంకలో ఈ బాంబు పేలుళ్లు జరిగాయని భావిస్తున్నట్టు శ్రీలంక రక్షణ శాఖ మంత్రి విజెవర్ధనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రెండు ఘటనలకు మధ్య సంబంధం ఏంటి ? న్యూజీలాండ్‌లో జరిగిన దాడితో లంకలో జరిగిన దాడులకు ఎటువంటి లింకు ఉందనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది.