ఎట్టకేలకు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నిజం అంగీకరించాడు. 2008 నాటి ముంబై దాడులకు పాకిస్థాన్‌కి చెందిన ఉగ్రవాద సంస్థలదే బాధ్యత అని ఒప్పుకున్నాడు నవాజ్ షరీఫ్. పాకిస్థాన్ గడ్డ మీద నుంచి చురుకుగా వ్యవహరిస్తున్న ఉగ్రవాద సంస్థలను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశం సరిహద్దులు దాటుకుని వెళ్లి ముంబైలో 150 మందిని హతమార్చేందుకు మనం ఉగ్రవాద సంస్థలకు సహకరించాలా అని ప్రశ్నించిన నవాజ్ షరీఫ్.. ఆ కేసు విచారణను ఇంకా ఎందుకు పూర్తి చేయడం లేదని సందేహాన్ని వెలిబుచ్చాడు. పాకిస్థాన్‌కి చెందిన డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. షరీఫ్ పరోక్షంగా చేసిన ఈ వ్యాఖ్యలే ముంబైపై దాడులకు పాల్పడిన లష్కరే తొయిబా ఉగ్రవాదులకు పాక్ సహకరించిందని చెప్పకనే చెబుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2008 నవంబర్ 26న సముద్ర మార్గం గుండా ముంబైలోకి ప్రవేశించిన దాదాపు 10 మంది సాయుధులైన లష్కరే తొయిబా ఉగ్రవాదులు.. రద్దీగా వుండే ప్రదేశాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి, పేలుళ్లకు పాల్పడి 166 మందిని పొట్టనపెట్టుకున్నారు. మరో 300మందికిపైగా జనం ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. 


ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఒబేరాయ్ ట్రిడెంట్, ది తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్ వంటి పబ్లిక్ ప్రదేశాల్లో ఈ దాడులు జరిగాయి. నవంబర్ 26న మొదలైన ఈ హింసాకాండ నవంబర్ 29 వరకు కొనసాగింది. ఈ దాడులకు ప్రధాన సూత్రధారి పాకిస్థాన్‌లోనే తలదాచుకున్నాడని, దాడికి వ్యూహం పాక్ గడ్డపైనే జరిగింది అని ఆరోపిస్తూ భారత్ ఆధారాలన్నింటినీ పాక్ ముందు పెట్టినప్పటికీ ఆ దేశ ప్రధాని హోదాలో వున్న నవాజ్ షరీఫ్ మాత్రం ఏనాడూ తన తప్పిదాన్ని అంగీకరించలేదు. కానీ అవినీతి ఆరోపణలతో పదవిని కోల్పోయిన తర్వాత షరీఫ్ ఇప్పుడిలా నిజాన్ని అంగీకరించడం వెనుక ఆంతర్యం ఏమై వుంటుందనే అంశం ప్రస్తుతం చర్చనియాంశమైంది.