ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా భయపడకుండా అణుపరీక్షలు చేస్తూ వచ్చిన ఆయన పరిస్థితులు మారడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో దక్షిణ కొరియా పర్యటనలో ఇక అణు పరీక్షలు నిలిపివేయనున్నట్లు ప్రకటించిన కిమ్‌.. తాజాగా అణ్వాయుధ పరీక్షల కేంద్రాన్ని ధ్వంసం చేయనున్నట్టు ప్రకటన చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో వచ్చే నెల 12న సింగపూర్‌లో సమావేశం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులో విదేశీ మీడియా ఎదుటే అణు పరీక్షలు జరిపే టన్నెల్‌ను పేల్చి వేయనున్నట్టు అధికారిక కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) వెల్లడించింది. అణుపరీక్షలకు చరమగీతం పాడినట్టు ప్రకటించిన నేపథ్యంలో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. మరోవైపు ఉత్తర కొరియా చీఫ్ నిర్ణయంపై  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. 'తెలివైన నిర్ణయం తీసుకున్నందుకు థ్యాంక్స్' అంటూ ట్వీట్ చేశారు.