భారత్‌లో చొరబాటుకు 600 మందికిపైగా పాక్ ఉగ్రవాదులు సిద్ధం.. జీ న్యూస్ వద్ద నిఘా వర్గాల నివేదిక
పాక్ భూభాగంలో భారత సరిహద్దు రేఖ వెంబడి మాటువేసిన సుమారు 600 మందికిపైగా పాక్ ఉగ్రవాదులు
భారత్-పాక్‌లను ఆనుకుని ఉన్న సరిహద్దు రేఖ వెంబడి పాకిస్తాన్ భూభాగంలో సుమారు 600 మందికిపైగా ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని భారత నిఘావర్గాల నివేదిక స్పష్టంచేస్తోంది. భారత నిఘా వర్గాల నుంచి జీ న్యూస్‌కి చిక్కిన సమాచారం ప్రకారం నిఘా వర్గాలు కేంద్ర హోంశాఖకు అందించిన ఈ నివేదికలో సుమారు 600 మందికిపైగా ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉండగా పాకిస్తాన్ భద్రతా బలగాలు, పాక్ ఆర్మీ సైన్యం అందుకు వారికి సహకరిస్తున్నాయని పేర్కొని ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్‌కి చెందిన బార్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) ఈ ఉగ్రవాదులకు అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్టుగా నిఘావర్గాల నివేదిక సందేహం వ్యక్తంచేసింది.
సర్జికల్ స్ట్రైక్స్ దాడుల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసిన తర్వాత పాక్ భూభాగంలో ఇంత భారీ సంఖ్యలో ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉండటం మళ్లీ ఇదే మొదటిసారి. ఇటీవలే పాకిస్తాన్‌లో జరిగిన ఎన్నికల్లో గెలిచి, ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్న ఇమ్రాన్ ఖాన్ భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం అని ప్రకటించిన నేపథ్యంలో పాక్ భూభాగం నుంచి ఇంత భారీ సంఖ్యలో ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధమవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
పాక్ ఎన్నికల్లో ఆర్మీ ఇమ్రాన్ ఖాన్‌కి వెన్నుదన్నుగా నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ.. అదే పాక్ ఆర్మీ ఇప్పుడిలా ఇమ్రాన్ ఖాన్ అభిమతానికి వ్యతిరేకంగా చొరబాట్లకు సహకరించడంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.