బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ రేసులో రఘురామ్ రాజన్..!
యునైటెడ్ కింగ్‌డమ్ సెంట్రల్ బ్యాంకైన `బ్యాంకు ఆఫ్ ఇంగ్లాండ్` గవర్నర్ రేసులో భారతీయ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ కూడా ఉన్నట్లు సమాచారం.
యునైటెడ్ కింగ్‌డమ్ సెంట్రల్ బ్యాంకైన 'బ్యాంకు ఆఫ్ ఇంగ్లాండ్' గవర్నర్ రేసులో భారతీయ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ కూడా ఉన్నట్లు సమాచారం. రఘురామ్ రాజన్ ఆర్బీఐ మాజీ గవర్నర్ కూడా. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నరుగా ఉర్జిత్ పటేల్ ఉన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థికవేత్తల జాబితాలో రఘురామ్ రాజన్ స్థానం చాలా ఉన్నతమైంది.
అందుకే అపార అనుభవం ఉన్న రాజన్‌కు తమ సెంట్రల్ బ్యాంకు బాధ్యతలను అప్పగించాలని యూకే ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే విషయంపై రాజన్ నుండి ఎలాంటి అధికారిక సమాచారం కూడా రాలేదు. 2014లో అంతర్జాతీయ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు తీసుకొనే అవకాశం వచ్చినప్పటికీ రాజన్ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాకి సేవలందించడానికే మొగ్గుచూపారు.
3 ఫిబ్రవరి 1963లో భోపాల్‌లో ఓ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు రాజన్. తమిళనాడు ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూలులో చదువుకున్నారు. ఆ తర్వాత ఐఐటి, ఢిల్లీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత ఐఐఎం, అహ్మదాబాద్ నుండీ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా చేశారు. ఆ తర్వాత స్టాక్ హోం స్కూలు ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించిన రాజన్, ఆర్థిక శాస్త్ర రంగంలో ఎన్నో పరిశోధనలు చేశారు.
మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కి ఆర్థిక సలహాదారుగా కూడా వ్యవహరించారు. 2003 నుండి 2006 వరకు ఐఎంఎఫ్‌కు చీఫ్ ఎకనామిస్ట్‌గా కూడా బాధ్యతలు వహించారు. ఆర్బీఐ నుండి గవర్నరుగా బాధ్యతలు ఉపసంహరించుకున్నాక.. మళ్లీ బోధన రంగంలోకి వెళ్లిపోయారు రాజన్. ఈ క్రమంలో ఆయన మళ్లీ బ్యాంకు ఆఫ్ ఇంగ్లాండ్ రేసులో ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది