Russia Ukraine War Updates: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పోలాండ్‌కు సరిహద్దులోని పశ్చిమ ఉక్రెయిన్ నగరమైన ఎల్వివ్‌లోని సైనిక స్థావరంపై రష్యా దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 35 మంది మృతి చెందగా 134 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎల్వివ్‌లోని సైనిక స్థావరంపై దాదాపు 20 క్రూయిజ్ మిస్సైల్స్‌ను రష్యా ప్రయోగించినట్లు చెబుతున్నారు. ఎల్వివ్ నగరం పోలాండ్‌కు కేవలం 25కి.మీ దూరంలో ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎల్వివ్‌లోని ఈ సైనిక స్థావరంలో ఉక్రెయిన్ సైనికులకు శిక్షణ ఇస్తుంటారు. అమెరికా, నాటో దళాలకు చెందిన ప్రతినిధులు తరచుగా ఇక్కడికి వచ్చి శిక్షణలో పలు మెలుకువలు నేర్పిస్తుంటారు. తాజా రష్యా దాడుల సందర్భంగా ఈ సైనిక స్థావరంలో విదేశీ ప్రతినిధులు ఎవరైనా ఉన్నారా లేరా అన్న దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలో ఇప్పటివరకూ రష్యా జరిపిన దాడుల్లో ఇదే అతిపెద్దదిగా చెబుతున్నారు.


ఇప్పటివరకూ ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతాన్ని సురక్షితంగా భావించామని.. కానీ తాజా దాడులతో తమలో భయం మొదలైందని ఎల్వివ్ నగరానికి చెందిన పలువురు వాపోతున్నారు. యురి వితివ్ అనే ఓ డ్రైవర్ మాట్లాడుతూ.. 'రష్యా యుద్ధం ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతానికే పరిమితమవుతుందనుకున్నాం. ఈరోజు ఉదయం వరకు అదే భావనలో ఉన్నాం. కానీ తాజా దాడులతో మాలో భయం మొదలైంది.' అని పేర్కొన్నారు.


ఓవైపు రష్యా అంతకంతకూ దాడులను ఉధృతం చేస్తున్నా ఉక్రెయిన్‌ గగతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించేందుకు నాటో సుముఖంగా లేకపోవడం గమనార్హం. దీనిపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉంది. రష్యాను అడ్డుకోవాలంటే ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించడమే మార్గమని ఎల్వివ్ మేయర్ ఆండ్రియ్ సాండోవీ పేర్కొన్నారు. 'దాడులకు మేం చింతిస్తున్నామని... ఆందోళన చెందుతున్నామని చెప్పడం చాలా సులువు. కానీ ఇక్కడ ప్రతీ గంట వైమానిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. రష్యన్లు పిల్లలు, సాధారణ పౌరులను పొట్టనబెట్టుకుంటున్నారు. ఇకనైనా ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలి. ఈరోజే ఆ నిర్ణయం కావాలి..' అంటూ ఆండ్రియ్ భావోద్వేగపూరితంగా స్పందించారు.