కుప్పకూలిన హెలీకాప్టర్.. 18 మంది దుర్మరణం!
కూలిన హెలీకాప్టర్, 18 మంది మృతి
రష్యాలో 15 మంది ప్రయాణికులతో టేకాఫ్ అయిన ఓ హెలికాఫ్టర్ కొద్ది సేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 15 మంది ప్రయాణికులతోపాటు ముగ్గురు హెలీకాప్టర్ సిబ్బంది కూడా కలుపుకుని మొత్తం 18 మంది దుర్మరణం పాలయ్యారు. రష్యాలోని సైబీరియాలో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఎంఐ 8 అనే హెలికాఫ్టర్ వాంకోర్ అనే కంపెనీ సిబ్బందిని తీసుకొని శనివారం ఉదయం బయల్దేరడానికి సిద్ధమైంది. అలా టేకాఫ్ అయిన తర్వాత కొద్దిసేపటికే ఎంఐ 8 హెలీకాప్టర్ రెక్కలు అదే లాంచ్ ప్యాడ్ నుంచి టేకాఫ్ అయిన మరో హెలీకాప్టర్‌కి తగలడంతో ఎంఐ 8 అక్కడికక్కడే కుప్పకూలిపోయిందని ఈ హెలీకాప్టర్ సేవల్ని నిర్వహిస్తున్న ఉటేర్ సంస్థ పేర్కొంది.
కుప్పకూలిపోయిన హెలీకాప్టర్ 2010లో తయారు చేసింది కాగా ఆ హెలీకాప్టర్ని నడిపిన పైలట్ కి 6,000 గంటల అనుభవం ఉందని, అందులో 2,300 గంటలపాటు ఆయన కెప్టెన్‌గా సేవలు అందించారని ఉటేర్ ఓ ప్రకటనలో స్పష్టంచేసింది. ఎంఐ 8 ఢీకొన్న మరో హెలీకాప్టర్ సురక్షితంగానే ల్యాండ్ అయినట్టు ఉటేర్ వెల్లడించింది. హెలీకాప్టర్ దుర్ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్టు ఆ దేశానికి చెందిన దర్యాప్తు సంస్థ ప్రకటించింది.