నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ గురువారం తన స్వదేశం పాకిస్థాన్‌కు వచ్చారు. 2012లో తాలిబన్‌ ఉగ్రవాదులు దాడి జరిగిన తర్వాత మలాలా పాకిస్తాన్ కు రావడం ఇదే తొలిసారి. గురువారం ఉదయం తల్లిదండ్రులతో కలిసి ఇస్లామాబాద్‌లోని బెనజీర్‌ భుట్టో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న మలాలాకు స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె పర్యటన వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపారు. నాలుగు రోజుల పాటు ఆమె స్వదేశంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని షాహిద్‌ ఖకాన్‌ అబ్బాసీతో మలాలా భేటీ అయ్యే అవకాశం ఉంది.


బాలికా విద్య, మానవహక్కుల కోసం ప్రచారం చేసిన మలాలాపై 2012 అక్టోబర్‌ 9న తాలిబన్‌ ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. స్కూల్‌ బస్సులోకి చొరబడి తీవ్రవాదులు ఆమెపై కాల్పులు జరిపారు. అయితే అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మలాలాను ఆమె తల్లిదండ్రులు బ్రిటన్‌లోని బర్మింగ్హమ్‌ తీసుకెళ్లారు. ఆమె అక్కడే పాఠశాల విద్యను పూర్తిచేశారు. బ్రిటన్ కి వెళ్ళినప్పటి నుంచి మలాలా పాకిస్థాన్‌కు రాలేదు. మానవ హక్కులు, బాలిక విద్య కోసం ఆమె చేసిన పోరాటానికి గానూ 2014లో నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది.