అగ్రరాజ్యం అమెరికా అన్నంత పనీ చేసింది.  కరోనా వైరస్ కారణంగా ఆర్ధికంగా, సామాజికంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కుంటున్న అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO పనితీరుపై ఇప్పటికే గుర్రుగా ఉంది. కరోనా వైరస్ పుట్టిల్లు చైనాకు తొత్తుగా వ్యవహరిస్తూ.. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గురించి హెచ్చరించడంలో విఫలమైందని ఆరోపిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనికి సంబంధించి ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. WHO పని తీరును తప్పుపట్టారు. నిధులు వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. ఇవాళ ఏకంగా WHOతో తెగదెంపులు చేసుకునేందుకు నిర్ణయించారు. దీనికి సంబంధించి అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఆయన అధికారిక ప్రకటన చేశారు. 


WHO పూర్తిగా చైనా నియంత్రణలో పని చేస్తోందని ట్రంప్ విమర్శించారు. ఏడాదికి 40 మిలియన్ డాలర్ల నిధులు ఇస్తున్న చైనాతో కలిసి WHO పని చేసిందన్నారు. అమెరికా ఏడాదికి 450 మిలియన్ డాలర్ల నిధులు సమకూరుస్తోందని తెలిపారు. కానీ కరోనా వైరస్ విషయంలో అమెరికా సహా ప్రపంచ దేశాలను హెచ్చరించడంలో, చైనా నుంచి వైరస్ ఇతర దేశాలకు వ్యాప్తి చెందకుండా  అరికట్టడంలో WHO విఫలమైందని చెప్పారు. కొత్త ఆరోగ్య సంస్కరణలు తీసుకోవడంలోనూ విఫలమైన WHOతో తాము తెగదెంపులు చేసుకుంటున్నామని ప్రకటించారు. అంతే కాదు ఇప్పటి నుంచి WHOకు ఇచ్చే నిధులను ప్రజారోగ్యం కాపాడడానికి  మిగతా  ప్రపంచ దేశాల్లో ఉన్న ఆరోగ్య సంస్థలకు ఇస్తామని వెల్లడించారు.



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..