యూకేలోని ఆహార పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రజారోగ్యం దృష్ట్యా ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. కోకాకోలాతో పాటు ఇతర కూల్ డ్రింక్స్ కంపెనీలు తమ పానీయాల్లో షుగర్ కంటెంట్ తగ్గించకపోతే.. ప్రభుత్వానికి అదనపు పన్ను కట్టాల్సి ఉంటుందని యూకే ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా షుగర్ ఎక్కువగా ఉన్న శీతల పానీయాలు తాగడం వల్ల జనాలు ఊబకాయం బారిన పడుతున్నారని.. దీనికి అడ్డుకట్ట వేయడం కోసం ఈ విధానాన్ని అవలంబించాలని భావిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక డ్రింక్‌లో 100 మిలీలీటర్లకు గాను 5 గ్రాములు షుగర్ ఉంటే 18 పెన్సీలను కంపెనీ నుండి ట్యాక్స్ వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అదే షుగర్ శాతం ఎనిమిది గ్రాములు దాటితే.. 24 పెన్సీలు వసూలు చేస్తామని ప్రకటించారు. బ్రిటన్ దేశంలోని అన్ని దేశీయ, విదేశీ కూల్ డ్రింక్ కంపెనీలు అన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు.


ప్రస్తుతం యూకేలో ఒక్కో సగటు యువకుడు తాగే సాఫ్ట్ డ్రింక్స్ సంవత్సరం పాటు లెక్కగడితే.. దాదాపు ఒక్క బాత్ టబ్ వరకు షుగర్ తీయవచ్చని అంచనా. యువతీ, యువకులు స్థూలకాయం బారిన పడడానికి ఈ డ్రింక్స్ దోహదపడుతున్నాయని.. అందుకే ఈ సమస్యకు అడ్డుకట్ట వేయడానికి కొత్త నిబంధనలను రూపొందిస్తున్నామని అంటోంది ప్రభుత్వం.


అయితే కూల్ డ్రింక్స్ కంపెనీలు అన్నీ ఈ కొత్త నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపినా.. కోకాకోలా మాత్రం కొన్ని డ్రింక్స్ తయారుచేసేటప్పుడు షుగర్ తగ్గించడం కుదరదని.. అది నాణ్యత మీద ప్రభావం చూపిస్తుందని తెలిపింది. ముఖ్యంగా కోకాకోలా క్లాసిక్ లాంటి డ్రింక్స్ విషయంలో తాము నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని తెలపడం గమనార్హం