న్యూయార్క్‌: సరిహద్దు ప్రాంతంలో  కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచూ ఉల్లంకిస్తూ,  ఇండియన్ ఆర్మీపై  పదేపదే దాడులకు  పాల్పడుతున్న దాయాది దేశం పాకిస్థాన్‌.. తాజాగా మరో హెచ్చరిక చేసింది. ఇండియన్ ఆర్మీకి దీటైన జవాబు  చెప్పేందుకే అణ్వాయుధాలను తయారు చేసినట్లు పాక్‌ ప్రధాని షాహిద్‌ ఖఖాన్‌ అబ్బాసీ మీడియాతో చెప్పారు. ఈ అణ్వాయుధాలు సురక్షితంగా ఉండేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికాలోని "కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌" ఏర్పాటుచేసిన కార్యక్రమంలో  పాల్గొన్న అబ్బాసీ మాట్లాడుతూ. ‘మా వద్ద  అణ్వాయుధాలు ఉన్నాయన్న మాట నిజమే. కానీ అవి అత్యంత భద్రతా వ్యవస్థల నడుమ సురక్షితంగా ఉన్నాయి.  మా శత్రువులను ఎదుర్కొనే సమయం వచ్చినప్పుడు వాటిని వినియోగిస్తాం. కాకపొతే మరీ పెద్ద  సామర్ధ్యం ఉన్నవి కాకుండా..  తక్కువ శ్రేణి అణ్వాయుధాలను మేం అభివృద్ధి చేశాం. అవసరమొస్తే మాతో కయ్యానికి కాలు దువ్వే  భారత్‌ వ్యూహాలకు వాటితో  గట్టిగా జవాబు  చెబుతాం.’ అని పాక్ ప్రధాని అబ్బాసీ తెలిపారు. 


పాకిస్తాన్ కి  అణు పరిశోధనా  సామర్థ్యం ఉందని.. 1960ల్లోనే ఆ వ్యవస్థను తాము  ఏర్పాటు చేశామని  అబ్బాసీ తెలిపారు. భవిష్యత్తుల్లోనూ తమ దేశ రక్షణార్ధం ఈ వ్యవస్థను మరింత అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. ఇక పాక్‌ తీవ్రవాదులకు స్థావరంగా పని చేస్తుందన్న  వార్తలపై కూడా అబ్బాసీ మాట్లాడారు. ‘పాకిస్తాన్  ఒక బాధ్యతాయుతమైన దేశం . అనేక సంవత్సరాలుగా టెర్రరిజాన్ని అరికట్టేందుకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నామని వెల్లడించారు.