యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్ కొత్త ఫీచర్లు
వాట్సాప్ యూజర్లకు ఆ సంస్థ మరో గుడ్ న్యూస్ అందిస్తోంది.
వాట్సాప్ యూజర్లకు ఆ సంస్థ మరో గుడ్ న్యూస్ అందిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అప్‌డేట్ చేస్తున్న వాట్సాప్ ఈసారి మరో అధునాతన సాంకేతికతను తీసుకొస్తోంది. ఈ కోవలోనే ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ సిద్ధమవుతోంది.
‘స్వైప్ టు రిప్లై’ పేరుతో కొత్త ఫీచర్ రానుంది. ఇప్పటి వరకు మనం వాట్సాప్ మెసేజ్‌కు రిప్లై ఇవ్వాలనుకుంటే దానిపై లాంగ్ ప్రెస్ చేయాలి. అయితే, ఈ స్వైప్ టు రిప్లై ఫీచర్ ద్వారా మనం మెసేజ్‌ను కుడివైపుకు స్వైప్ చేస్తే సరిపోతుందని వాట్సాప్ తెలిపింది. దీని ద్వారా మెసెజ్‌ను కుడివైపునకు స్వైప్ చేయడం ద్వారా సులువుగా రిప్లై పంపే వీలుంటుంది. ఐఓఎస్ యూజర్లకు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఆప్షన్.. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుందని.. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని పేర్కొంది.
అంతేకాదు.. త్వరలోనే యాప్ యూజర్ ఇంటర్ ఫేస్‌లో డార్క్ మోడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్. యూట్యూబ్, ట్విటర్లలో ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉండగా.. త్వరలోనే వాట్సాప్‌లో కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. 'డార్క్ మోడ్' ఫీచర్ వల్ల నెట్ బ్రౌజింగ్ చేసే వారికి సౌకర్యంగా ఉంటుంది. చీకట్లో, వెలుతురు తక్కువ ఉన్న చోట్ల ఫోన్ వాడేటప్పుడు కళ్లు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.