అమరావతి: డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరు, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు డయల్‌ యువర్‌ సీఈవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్‌ ఎ.మల్లిఖార్జున తెలిపారు. ప్రతీ గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు డయల్‌ యువర్‌ సీఈవో కార్యక్రమం ఉంటుందని.. ఎవరికైనా ఈ పథకంపై సందేహాలు, సమస్యలు ఉంటే 0863–234166 నెంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. 


ఆంధ్రప్రదేశ్‌‌లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నవరత్నాలలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు మల్లిఖార్జున వెల్లడించారు.