సినీ నటుడు శివాజీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఆయన కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి అందరూ ఐకమత్యంతో ముందుకు దూసుకుపోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆపరేషన్ గరుడ ఇంకా ఆగలేదన్నారు. ఏపీలో విధ్వంసం చేయడానికే పలువురు ప్రయత్నిస్తున్నారని... కానీ అమరావతి కోసం రైతులిచ్చిన ఎకరాలు వృథా కావని.. గొప్ప రాజధానిని ఏర్పాటు చేసుకొనే దిశగా ఏపీ అడుగులు వేస్తుందని శివాజీ అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా శివాజీ పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నించారు. మద్రాస్ లాంటి అత్యున్నత నగరం రాజధానిగా ఉండడం వల్లే ఎన్టీఆర్ గొప్ప నటుడిగా రాణించడమే కాకుండా.. రాజకీయంగా కూడా తన సత్తా చాటారన్నారు. అలాగే చిరంజీవి కూడా మెగాస్టార్ కావడానికి కారణం మద్రాసు నగరమన్నారు.


తాను ఈ నెల 30వ తేదిన మళ్లీ స్పందిస్తానని శివాజీ తెలిపారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తేనే మరిన్ని పరిశ్రమలు వస్తాయని.. తద్వారా మంచి ఉపాధి కూడా దొరుకుతుందని శివాజీ తెలియజేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ఏం చేశారని, అమరావతికి అన్ని ఎకరాలు అవసరమా అని జనసేన వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ అడుగుతున్నారని.. కానీ జరుగుతున్న అభివృద్ధి కొందరికి కనిపించపోవడం శోచనీయమన్నారు.