కరోనా కష్టకాలంలో ఆపన్నులను ఆదుకుంటూ రియల్ హీరోగా మారిన రీల్ హీరో సోనూ సూద్ ( Sonu sood ) మరోసారి హ్యాట్సాఫ్ అన్పించుకుంటున్నారు. డబ్బుల్లేక కుమార్తెలనే కాడెద్దులుగా భూమి దున్నుకుంటున్న ఓ కధనానికి స్పందించారు సోనూ సూద్. అంతేకాదు మాట ఇచ్చిన గంటల వ్యవధిలోనే అమలు చేశారు. ఇంటి ముందు ట్రాక్టర్ ప్రత్యక్షం చేయించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోనూ సూద్. రీల్ పై ఎక్కువగా విలన్ కేరెక్టర్లు పోషించినా నిజ జీవితంలో రియల్ హీరోగా మారిపోయారు. లాక్ డౌన్ కాలంలో వేలాది మంది వలస కూలీల్ని ( Migrant workers ) సొంత ఇళ్లకు తరలించడం, ఆపన్నులకు సహారా  అందిస్తూ దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కేవిపల్లిలో ఓ రైతు పేదరికంలో మగ్గిపోతున్నాడు. కాడెద్దులు కొనడానికి డబ్బుల్లేక ఇద్దరు కుమార్తెల్నే కాడెద్దులుగా మలిచి పొలం దున్నుకోసాగాడు. అమ్మాయిలిద్దరూ కాడె లాగుతుంటే..తల్లిదండ్రులిద్దరూ విత్తు జల్లే పని చేశారు. వివిధ ఛానెళ్లలో ఈ కధనాన్ని చూసి సోనూ సూద్ వెంటనే స్పందించారు.


సాయంత్రం లోగా ఆ  పేద రైతు కుటుంబానికి ట్రాక్టర్ అందిస్తానని ట్వీట్ ద్వారా హామీ ఇచ్చారు. అంతేకాదు..ఇచ్చిన మాటకు తగ్గట్టుగా సదరు రైతు ఇంటి ముందు సాయంత్రం లోగా ట్రాక్టర్ పంపించారు. తమ ఇంటి ముందు ఆగిన ట్రాక్టర్ చూసి ఆ కుటుంబం ఆశ్చర్యపోయింది.  ఆనందానికి హద్దు లేకుండా పోయింది. సోనూ సూద్ కు మనసా వాచా కృతజ్ఞతకలు తెలుపుకున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోనూ సూద్ పై మరోసారి ప్రశంసల వర్షం కురుస్తోంది. హ్యాట్సాఫ్ సోనూ సూద్...యూ ఆర్ ఎ రియల్ హీరో. Also read: Sonu Sood: కాడెద్దులుగా రైతు కూతుళ్లు.. చలించిపోయిన సోనూ సూద్