అమరావతి: ప్రముఖ హాస్య నటుడు అలీ త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని, అందుకు ముహూర్తం, వేదిక కూడా ఖరారయ్యాయని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రస్తుతం చేస్తోన్న ప్రజా సంకల్ప యాత్ర జనవరి 9న ముగియనున్న నేపథ్యంలో అదే రోజు, అదే ముహూర్తంలో అలీ వెళ్లి జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరతారనేది ఆ వార్తల సారాంశం. ఇదిలావుంటే, ఆదివారం ఉదయం అలీ స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్‌ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పవన్ కల్యాణ్, అలీ మధ్య గత కొన్నేళ్లుగా మంచి అనుబంధం వుంది. ఎన్నో సినీ వేదికలపై ఈ విషయాన్ని ఇరువురూ అభిమానులతో పంచుకున్న సందర్భాలూ వున్నాయి. ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు సైతం వారి కెరీర్‌లో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో అలీ జనసేన పార్టీలో చేరుతారు కానీ వైఎస్సార్సీపీలో ఎందుకు చేరుతారు అని జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, అలీ దాదాపు వైసీపీలో చేరడం ఖాయం అనే అభిప్రాయం అటువైపు నుంచి సైతం అంతే బలంగా వినిపిస్తోంది. 


ఇన్ని సందిగ్ధాల మధ్య నేడు అలీ, పవన్ కళ్యాణ్‌ల మధ్య దాదాపు 20 నిమిషాల పాటు భేటీ జరగడం చర్చనియాంశమైంది. అయితే, ఈ సమావేశం అనంతరం బయటికొచ్చిన అలీ సైతం అక్కడున్న మీడియాతో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోవడంతో లోపల ఏం జరిగిందనే అంశంపై ప్రస్తుతానికి స్పష్టత కొరవడింది.