అమరావతి: మంగళగిరి నుంచి టీడీపి ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌‌పై గెలిచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఆయనను రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)కు ఛైర్మన్‌గా నియమించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయని సమాచారం. 


గుంటూరు జిల్లాలో పార్టీకి కీలక నేతల్లో ఒకరైన ఆళ్ల రామకృష్ణా రెడ్డికి వైఎస్ జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి ఖాయమని భావించినప్పటికీ అలా జరగలేదు. అయితే, ఆళ్లకు ఏపీ కేబినెట్‌లో చోటు దక్కకపోవడానికి కారణం ఆయనకు రాజధాని నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న సీఆర్‌డీఏ సంస్థకు ఛైర్మన్‌గా నియమించాలని జగన్ నిర్ణయం తీసుకోవడమేనని తెలుస్తోంది.