AP Politics: శ్రీకాళహస్తిలో టీడీపీ Vs వైసీపీ.. గుడివెనుక నా సామీ!
AP Politics: ఆ జిల్లాలో రాజకీయాలన్నీ పరమశివుడే చుట్టే తిరుగుతున్నాయి..! అధికారంలోకి రావడమే ఆలస్యం అన్నట్టు.. అక్కడి నేతలంతా.. ఆ గుడినే ఆదాయ వనరుగా మార్చేసుకుంటున్నారు. అధికారంలో ఉండగానే నాలుగురాళ్లు వెనకేసుకోవాలని అనుకుంటున్నారట. ఇంతలా రాజకీయాల్లోకి బోలా శంకరుడిని వాడుకుని క్యాష్ చేసుకుంటున్న నియోజకవర్గం ఏంటి.. ఆ నేతలెవరు..!
AP Politics: తిరుపతి జిల్లా రాజకీయాలన్నీ శ్రీకాళహస్తి ఆలయం చుట్టే తిరుగుతున్నాయి. చేతనైతే ఆలయానికి సేవ చేయాల్సిన నేతలు.. అక్కడి వాయులింగేశ్వరుడినే నిండా ముంచేస్తున్నారట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న రీతిలో అందిన కాడికి దోచుకుంటున్నారట. తాజాగా శ్రీకాళహస్తి ఆలయంలో రాజకీయ జోక్యం ఎక్కువైందని భక్తులే పెదవి విరుస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. భక్తిభావం ఉండాల్సిన చోట రాజకీయ నేతల పెత్తనం ఎక్కువైందనిగుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. గత వైసీపీ సర్కార్ పాలనలో ఈ తంతుకు తెరలేవగా.. ఇప్పుడు కూటమి పార్టీ నేతలు దీన్నే కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాశం అయ్యింది.
చిత్తూరు జిల్లాలో గతంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కీలకంగా ఉండేవారు. ఆయన శ్రీకాళహస్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలో చక్రం తిప్పారు. ఆయన తర్వాత ఎస్‌సీవీ నాయుడు కూడా ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. శివరాత్రి లాంటి ముఖ్య రోజుల్లోనూ సామాన్య భక్తలకు ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేవారట. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక నేత బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక శ్రీకాళహస్తి ఆలయంలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందట. మధుసుధన్ రెడ్డి శ్రీకాళహస్తి ఆలయంలో ప్రతి విషయంలోనూ తలదూర్చడం ఎక్కువైందని ఆరోపణలు ఉన్నాయి. ఇక శివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు.. ఆలయంలో అర్చకుల కంటే ఎమ్మెల్యేనే ఎక్కువగా కనిపించేవారట. అంతే కాకుండా ఆలయ విషయాల్లో అనేక సొంత నిర్ణయాలతో వివాదాస్పదం అయ్యారు.
మరోవైపు ఆలయంలో కొన్ని నిర్మాణాల వల్ల అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. అటు టెండర్ల విషయంలోనూ ఆనేక ఆరోపణలు వచ్చాయి. ఆలయ పాలకమండలి కంటే స్థానిక ఎమ్మెల్యేగా తానే నిర్ణయాలు తీసుకునేవాడని ఎమ్మెల్యేపై ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు శివరాత్రి సందర్భంగా ఓ ప్రైవేటు ఆల్బం కోసం ఆలయంలో షూట్ చేయడం అప్పట్లో పెద్ద వివాదమే రేపింది. రెండు దశాబ్ధాలుగా శ్రీకాళహస్తి ఆలయ పరిసరాల్లో సినిమా షూటింగ్‌లు, ఇతరత్రా షూటింగ్‌లను నిషేధిస్తే.. వైసీపీ సర్కార్ మాత్రం ఎలా పర్మిషన్ ఇస్తుందంటూ ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు. ఆలయాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాడని టీడీపీ నేతలు ఆరోపించడం సంచలనం రేపింది.
ఇదిలా ఉంటే.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. శ్రీకాళహస్తి నుంచి కూటమి నేత బొజ్జల సుధీర్ రెడ్డి బంపర్ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే తీరుపై ప్రతిరోజు విమర్శల వర్షం కురిపించినా నేతలు.. ఇప్పుడు చేస్తున్నది ఏంటని ప్రశ్నలు జోరగా వినిపిస్తున్నాయి.. రాజకీయంగా వ్యక్తులు మారారు తప్పితే.. ఆలయంలో రాజకీయ జోక్యం ఏమాత్రం తగ్గలేదని భక్తులు అసహ్యించుకుంటున్నారట. తాజాగా శ్రీకాళ హస్తి ఆలయంలో భారీగా అక్రమాలు జరుగుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. బొజ్జల కుటుంబం ఆయలంలో తిష్టవేసి మంచి ఆదాయ వనరుగా ఆలయాన్ని మార్చుకుందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నాడని మండిపడ్డారు. ఆలయంలో స్క్రాప్ అమ్మకాల్లో భారీగా గోల్‌మాల్ జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో స్క్రాప్‌ను 20 రూపాయలకు కిలో చొప్పులు అమ్మితే.. ఇప్పుడు కిలో 11 రూపాయలకు విక్రయిస్తున్నారని.. ఈ అమ్మకాల వెనుక కోట్ల రూపాయల కుంభకోణం దాగుందని ఆరోపిస్తున్నారు.
అంతేకాదు.. శ్రీకాళహస్తి ఉప ఆలయాల దగ్గర దాతలు షెడ్లు వేయిస్తున్నారు. అయితే అక్కడ దాతల పేర్లు వేయించకుండా బిల్లుల చేసుకుని డబ్బులు స్వాహ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటు టెండర్లలో కోట్లు రూపాయలు దండుకునేందుకు సిద్దమయ్యారని వైసీపీ నేతలు అరోపిస్తున్నారు. గత ఐదేళ్లు తమ సర్కార్‌పై పదేపదే విమర్శలు చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు చేస్తున్నదేంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో పార్టీలు మారిన శ్రీకాళహస్తిలో మాత్రం అవినీతి తగ్గడం లేదని భక్తులు అంటున్నారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడికి రాజకీయ రంగు పులిమి అవినీతి పెరగడం శివుడికి తలనొప్పిగా మారిందంటున్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు.. శ్రీకాళహస్తి ఆలయంలో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..
Aslo Read: Mohini Dey: రెహమాన్‌తో సీక్రెట్ ఎఫైర్.. ఎట్టకేలకు స్పందించిన మోహినీ డే.. ఏమందో తెలుసా..?
Also Read: Tirumala: ఎంతకు తెగించార్రా..?.. తిరుమలలో బైట పడ్డ మరో షాకింగ్ ఘటన.. అసలేం జరిగిందంటే..?
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.