Konaseema Violence: కోనసీమ భగ్గుమంది. కులకుంపటి రాజుకుంది. కోనసీమ జిల్లా పేరు మార్పు చిలికి చిలికి గాలివానగా మారి హింసాత్మకమైంది. ఆందోళన తీవ్రతరం చేసేందుకు ఆందోళనకారులు సిద్ధమౌతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కులరక్కసి రగులుకున్న కోనసీమ రణరంగమైంది. ఎప్పుడూ కులాల మధ్య సంక్లిష్టతలతో నివురుగప్పిన నిప్పులా ఉండే కోనసీమ భగ్గుమంది. కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని సహించలేని శక్తులు రగడ చేశాయి. చిలికి చిలికి గాలివానగా మారి బీభత్సానికి దారి తీసింది. విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు. కోనసీమ సాధన సమితి పేరుతో ఒక్కసారిగా ప్రారంభమైన ఆందోళన శృతి మించింది. రోడ్లపై పడి..విధ్వంసం చేశారు. బస్సులు తగలబెట్టారు. పోలీసు వాహనాలు ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. జిల్లా ఎస్పీ సైతం రాళ్ల దాడిలో గాయపడ్డారు. మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు నిప్పంటించారు. 


ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేత


పరిస్థితిని అదుపుతెచ్చేందుకు కోనసీమ జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. మరోవైపు ఉద్రిక్తతలు పెరిగి పెద్దవి కాకుండా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. భారీగా పోలీసుల్ని మోహరించారు. విశాఖపట్నం, శ్రీకాకుళం ఇతర ప్రాంతాల్నించి అదనపు పోలీసుల బలగాల్ని రప్పించారు. రాత్రి నుంచి పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉంది. జిల్లాలో ప్రజా రవాణా పూర్తిగా స్థంబించింది. 


మరోవైపు ఆందోళన తీవ్రం చేసేందుకు ఆందోళనకారులు మరోసారి సిద్ధమయ్యారు. కోనసీమ జిల్లా కావాలనుకునేవారు అమలాపురంలోని నల్లవంతెన వద్దకు రావాలని పిలుపునిచ్చారు. ఇటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. పెద్దఎత్తున పోలీసు బలగాల్ని మొహరించారు. మరోసారి ఉద్రిక్తతలు చెలరేగకుండా కట్టుదిట్టైమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి అరెస్టులు కూడా ప్రారంభమయ్యాయి. పరిస్థితి పూర్తిగా అదుపులో వచ్చేవరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. 


హఠాత్తుగా ఆందోళన


వాస్తవానికి చాలాకాలం నుంచి లేదా చాలారోజుల్నించి జరుగుతున్న ఉద్యమం కానేకాదు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కోనసీమ సాధన సమితి శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని 2-3 రోజుల్నించి చెబుతోంది. సోషల్ మీడియా వేదికగా మెస్సేజీలు పంపింది. శాంతియుతంగా ర్యాలీ చేస్తామని చెప్పిన కోనసీమ సాధన సమితి ఆందోళనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. బస్సులు తగలబట్టారు. దళిత నేతలు, ప్రజా ప్రతినిధుల ఇళ్లను టార్గెట్ చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం చడీచప్పుడు లేకుండా హఠాత్తుగా మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇళ్లను టార్గెట్ చేసి..నిప్పంటించారు. విశ్వరూప్ తప్పించుకోగా, పోలీసులు సకాలంలో రావడంతో పొన్నాడ సతీష్ కుటుంబంతో సహా సేఫ్ అయ్యారు. 30 మంది పోలీసులకు గాయాలయ్యాయి.


దళితులు వర్సెస్ బీసీలు వర్సెస్ కాపులు


ఈ వ్యవహారంలో తెరవెనుక కొన్ని శక్తులు పనిచేసినట్టు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం నేతల హస్తముందని అటు పోలీసులు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే కోనసీమలో దళితులు వర్సెస్ బీసీలు వర్సెస్ కాపు సామాజికవర్గాల మధ్య ఎప్పుడూ నివురుగప్పిన నిప్పులానే ఉంటుంది. ఈ మూడు సామాజికవర్గాలకు ఒకరంటే ఒకరికి పడదు. దీన్ని ఆసరగా చేసుకుని కొంతమంది నేతలు రెచ్చగొట్టి శాంతియుత ర్యాలీని హింసాత్మకంగా మార్చేందుకు ప్రణాళిక రచించారని పోలీసులు అంచనా వేస్తున్నారు. లేకపోతే ఇంత హింసాత్మకం జరగదనేది అంచనా. అటు హోంమంత్రి తానేటి వనిత కూడా జనసేన హస్తముందని స్పష్టంగా ఆరోపించారు. 


ప్రస్తుతం కోనసీమలో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. కుట్రదారులెవరో తేల్చేపనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. సోషల్ మీడియా ఎక్కౌంట్లు, ఫోన్ వివరాలు పరిశీలిస్తున్నారు. 


Also read: Konaseema Protest: కర్ఫ్యూతో తగ్గిన ఉద్రిక్తత.. నివురుగప్పిన నిప్పులా కోనసీమ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి