న్యూఢిల్లీ: ఎన్డియే కూటమి నుంచి తెలుగుదేశం పార్టీయే వెళ్ళిపోయిందని బీజేపీ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. తాము టీడీపీని దూరం చేసుకోలేదని, చంద్రబాబే తనంతట తానుగా బయటకు వెళ్లిపోయారని అన్నారు. ఢిల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. తాము టీడీపీని దూరం చేసుకోవాలని అనుకోలేదని, ఆ పార్టీ నిర్ణయాన్ని ఊహించలేదని వ్యాఖ్యానించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు రాజీనామాపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. కొత్త అధ్యక్షుణ్ణి నియమించాల్సి ఉన్నందున ఆయన రాజీనామా చేశారు అని ముక్తసరిగా అన్నారు. మరి కొత్త అధ్యక్షుడు ఎవరనే ప్రశ్నకు.. త్వరలో మీకే తెలుస్తుంది అన్నారు. దేశ రాజకీయాల గురించి మాట్లాడుతూ,  2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.


అలానే మక్కా మసీద్‌ పేలుళ్ల కేసు తీర్పుపై కూడా అమిత్‌ షా స్పందించారు. హిందువులను టెర్రరిస్టులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, ఆ క్రమంలోనే అసీమానంద్‌ పేరు తెరమీదకు తెచ్చారన్నారు. అసలు అసీమానంద్‌ ఎవరో ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు. డబ్బున్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, భిక్షాటన చేసుకునే సాధారణ సాధువుగా జీవిస్తున్న అసీమానంద్‌ చేసిన తప్పేంటని అమిత్‌ షా నిలదీశారు. ఈ కేసు తీర్పునిచ్చిన జడ్జి రాజీనామాపై మాట్లాడుతూ నిజానికి ఆయన త్వరలోనే పదవీ విరమణ చేయనున్నారని, ఆలోపు ఉన్న సెలవులను ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో సెలవు కోసం చేసుకున్న దరఖాస్తును రాజీనామాగా చిత్రీకరించాని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.