చంద్రన్న పెళ్లి కానుకపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రన్న పెళ్లికానుకపై మంగళవారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. చంద్రన్న పెళ్లి కానుకను విస్తరించాలని నిర్ణయించారు. నిన్నమొన్నటి వరకు ఏపీలోని వరుడిని చేసుకుంటేనే వర్తించే ఈ పథకం.. ఇప్పుడు పొరుగు రాష్ట్రాల అబ్బాయిలను చేసుకున్నా వర్తింపజేయాలని నిర్ణయించారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిసా, ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రాలకు చెందిన వరుడిని పెళ్లి చేసుకున్నా పెళ్లి కానుక వర్తింపజేసేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.


అంతేకాదు.. వరుడు దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నప్పటికీ, వధువు దారిద్య్రరేఖకు దిగువున ఉంటే ‘చంద్రన్న పెళ్లి కానుక’కు అర్హులుగా గుర్తించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సమావేశంలో దుల్హన్‌ పథకం పేరును ‘దుల్హన్‌-చంద్రన్న పెళ్లి కానుక’గా, గిరిపుత్రిక కల్యాణం పథకం పేరును ‘గిరిపుత్రిక-చంద్రన్న పెళ్లికానుక’గా మార్పులు చేశారు. చంద్రన్న పెళ్లి కానుకలో తలెత్తే సమస్యలనుఈ నెల 10 లోపు పరిష్కరించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.