ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తీపికబురు అందించింది. దాదాపు 222 పోస్టుల భర్తీకోసం నియామక సంస్థ ఈ నెలాఖరులోగా 2 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. 22 పోస్టులతో ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్స్‌,  200 పోస్టులతో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి ఏపీపీఎస్సీ నిర్ణయించింది. మంగళవారం ఏపీపీఎస్సీ ఛైర్మన్  పిన్నమనేని ఉదయభాస్కర్‌ నేతృత్వంలో జరిగిన సమావేశంలో గ్రూప్-1, గ్రూప్-2 తుది సిలబస్ లకు ఆమోద ముద్ర వేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అటు యూపీఎస్సీ తరహాలో గ్రూప్స్ పరీక్షల్లో తొలిసారి నెగెటివ్‌ మార్కుల విధానాన్ని అమలు చేయనున్నారని తెలిసింది. దీని ప్రకారం ప్రతి మూడు తప్పు జవాబులకు ఒక మార్కు చొప్పున కట్‌ అవుతుంది. కాగా నెలాఖరులోగా రిక్రూట్‌మెంట్‌ క్యాలెండర్‌ ను విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ  చర్యలు తీసుకోనుంది. అయితే  గ్రూప్‌-1 డ్రాఫ్ట్‌ సిలబస్ లో స్వల్ప మార్పులకు అవకాశమిచ్చిన  ఏపీపీఎస్సీ.. గ్రూప్‌-2లో కామన్‌ సిలబస్‌ ను మార్చకుండా ఆమోదం తెలిపిందని సమాచారం.
 
అటు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 243అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్యశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.


రెండు రోజుల క్రితం రాష్ట్రంలోని ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో డీఎస్సీ, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో మరోసారి వయోపరిమితిని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


డీఎస్సీ సహా 18 వేల ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటిలో ఆరు వేల పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు.  టీచర్లు, పోలీసు ఉద్యోగాలు మినహా మిగిలిన అన్ని పోస్టులను కమిషన్‌ భర్తీ చేస్తుందని ఏపీపీఎస్సీ చైర్మన్‌ పి.ఉదయభాస్కర్ అన్నారు.  వివిధ కేటగిరీల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు 30 నుంచి 40 వరకు నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.


ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన పోస్టులు: 18,450


  • గ్రూపు-1: 182 పోస్టులు

  • గ్రూపు-2: 337 పోస్టులు

  • గ్రూపు-3: 1670 పోస్టులు

  • హోంశాఖ: 3000 పోస్టులు

  • వైద్యారోగ్య శాఖ: 1604 పోస్టులు

  • లెక్చరర్స్: 725 పోస్టులు

  • ఉపాధ్యాయులు: 9275 పోస్టులు

  • ఇతర శాఖలో ఖాళీలు: 1657 పోస్టులు