ఈ రోజు తూర్పు గోదావరి ప్రాంతంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. పశువుల్లంక ప్రాంతంలో అనేకమంది విద్యార్థులతో పాటు కొందరు స్థానికులతో బయలుదేరిన నాటుపడవ మార్గమధ్యంలో వంతెన స్తంబానికి తగలడంతో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సముద్రానికి దగ్గరగా ఉండే పాయ వద్ద ప్రమాదం జరగడంతో ప్రయాణికులంతా మునిగిపోయారు. వీరందరూ పదవ తరగతి చదువుతున్న విద్యార్థులే కావడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీరిలో 26 మందిని గ్రామస్తులు వెంటనే నదిలోకి దిగి కాపాడగా.. నలుగురు గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయి. ఎక్కువగా నీరు ప్రవహిస్తుండం వల్ల వంతెన పిల్లర్‌కు గట్టిగా పడవ తగిలినప్పుడు బరువు కాయలేక మునిగిపోయిందని గ్రామస్తులు అంటున్నారు. అయితే ఈ పడవలో నిజంగా ఎంతమంది పట్టే అవకాశం ఉంది.. అసలు ఎంతమంది ఎక్కారు? అనే వివరాల మీద ఇంకా అదనపు సమాచారం రావాల్సి ఉంది. 


కాగా.. తాజా ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి రిపోర్టు తయారుచేసి వెనువెంటనే అందించాలని.. పరిస్థితిని సమీక్షించాలని పోలీసులతో పాటు రెవెన్యూ యంత్రాంగాన్ని చంద్రబాబు ఆదేశించారు. ఈ ప్రమాదం జరగగానే అధికార యంత్రాంగం ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసింది.


రాజమండ్రి నుండి అనేకమంది ఎస్.డి.ఆర్.ఎఫ్ సిబ్బంది ప్రమాద స్థలికి బయలుదేరారు. ఇదే సంవత్సరం మే నెలలో కూడా తూగో జిల్లా దేవీపట్నం ప్రాంతంలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. 55 మంది ప్రయాణిస్తున్న లాంచీ అకస్మాత్తుగా వీచిన సుడిగాలుల వల్ల ఒక్కసారిగా నీట మునిగిన ఘటనలో పలువురు మరణించారు. ఈ ఘటన జరిగి రెండు నెలలు కూడా గడవకముందే మళ్లీ ఇలాంటి ఘటన జరగడంతో అధికారులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.