విద్యార్థులకు కాస్త ఉపశమనం కలిగించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అమలుచేస్తున్న 'నో స్కూల్ బ్యాగ్ డే'ను ఏపీలోనూ అమలుచేసింది. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలన్నింటిలో 1-12వ తరగతి వరకు చదివే విద్యార్థులు శనివారం నాడు పాఠశాలలకు స్కూల్ బ్యాగు తీసుకురావాల్సిన అవసరం లేదని గతేడాది యూపీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ప్రభుత్వం మున్సిపాలిటీల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 'నో బ్యాగ్ డే' అమలు చేసింది. విద్యార్థులకు విద్యా భారం లేని పాఠ్య పుస్తకాల మోత బరువు తగ్గించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం నెలలో రెండో, నాలుగో శుక్రవారాల్లో విద్యార్థులు పుస్తకాల్లేకుండా పాఠశాలకు రావాల్సి ఉంటుంది. ఆ రోజుల్లో ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజుల్లో చిత్రాలు, ఎక్సర్‌సైజ్ సహా ఇతర పద్ధతుల్లో ఉపాధ్యాయులు బోధిస్తారు. పిల్లల్లో చురుకుదనం పెంపొందిస్తారు.


గత శుక్రవారం ఏపీ 'నో బ్యాగ్ డే'ను అమలు చేశారు. ఏపీలోని 59 మున్సిపాలిటీలలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రూపొందించిన నిబంధనల ప్రకారం వీఎంసీ(విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్)కి చెందిన ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు నో బ్యాగ్ డేను ఉత్సాహంగా అమలుచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు రకరకాల వేషధారణతో అలంకరించుకుని వారి పాత్రల స్వభావం వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యాధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


కాగా ఇప్పటికే యూపీ, కర్ణాటక పాఠశాలల్లో వారంలో ఒకరోజు నో స్కూల్ బ్యాగ్ డే విధానం విజయవంతంగా అమలవుతోంది. తెలంగాణలోనూ ఈ విధానాన్ని అమలుచేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.