IMD Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ నెల 19 వరకూ భారీ వర్షాలు
IMD Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఏపీలో రానున్న రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వర్షాలు పెరగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IMD Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న 5-6 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ప్రమాదముందని హెచ్చరించింది.
బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. ఇది కాస్తా విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య తీరాన్ని తాకనుంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు ఇప్పటికే రాష్ట్రమంతా బలపడి ఉన్నాయి. దాంతో మధ్య ఆంధ్ర ప్రదేశ్, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈశాన్య అస్సోం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకూ రెండు ద్రోణులు కూడా కొనసాగుతున్నాయి. ఫలితంగా రేపు, ఎల్లుండి అంటే సోమ, మంగళవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఇక విజయనగరం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విశాఖపట్నం, కడప, కర్నూలు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక పార్వతీపురం మన్యం, అన్నమయ్య, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చు
అల్పపీడన ద్రోణి కారణంగా తెలంగాణలో సైతం మూడ్రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి. ఆదివారం వరకూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఈ నెల 18 వరకూ సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, భూపాలపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఎల్లో అలర్ట్ కూడా జారీ అయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook