TDP JSP Seats Discussion: ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్‌ జగన్‌ను దించేయాలనే కసితో తెలుగుదేశం పార్టీ, జనసేనలు ఉన్నాయి. చంద్రబాబు అరెస్ట్‌తో ఖరారైన వీరి పొత్తు ఇప్పుడు ఎన్నికల సమయం దూసుకొస్తుండడంతో మరింత బలపడుతుందా? బలహీనమవుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో పోటీపై ఇరు పార్టీల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన వ్యవస్థాపకుడు పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహం, సీట్ల పంపకంపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. మూడు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో కీలక విషయాలు చర్చించారని సమాచారం. ఈ చర్చల్లో సీట్ల పంపకంపై పేచీ వచ్చినట్లు తెలుస్తోంది. బయటకు వినిపిస్తున్న వార్తల ప్రకారం టీడీపీ అత్యధికంగా, జనసేన పావుకు పైగా స్థానాలు చంద్రబాబు ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP Politics: వైసీపీలో మరో వికెట్ డౌన్, రాజకీయాలకు దూరం కానున్న ఆ ఎంపీ


అయితే ఈ ప్రతిపాదనకు జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ అంగీకరించలేదని సమాచారం. ఇప్పటికే పొత్తు ధర్మం ప్రకారం తమను సంప్రదించకుండా అభ్యర్థులను ప్రకటించిన టీడీపీపై పవన్‌ గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు సీట్ల పంపకాల్లో తక్కువ స్థానాలు ప్రతిపాదించడాన్ని పవన్‌ అంగీకరించలేదని తెలుస్తోంది. యాభై నుంచి 60, 70 స్థానాలు జనసేన ఆశిస్తోంది. 2019లో చేసిన తప్పిదం ఇప్పుడు పునరావృతం కాకూడదని జనసేన భావిస్తోంది. చాలా రోజుల నుంచి జనసైనికులు, అభిమానులు ఇదే విషయాన్ని పవన్‌ దృష్టికి తీసుకెళ్తున్నారు. పార్టీలో పెద్ద ఎత్తున ఆశావహులు ఉండడంతో పవన్‌ భారీగా స్థానాలు ఆశిస్తున్నారు.

Also Read: YSRCP 6th List: కొనసాగుతున్న వైసీపీ 'మార్పులు'.. మార్గాని భరత్‌, వసంతకు భారీ షాక్‌


చెరి సగం లేదా వీలైనన్ని ఎక్కువ స్థానాలు పొందాలనే పట్టుదలతో పవన్‌ ఉన్నారు. చంద్రబాబు భేటీలో ఇదే విషయాన్ని చర్చించారని సమాచారం. ఎక్కువ స్థానాల కోసం పట్టుబట్టారు. కానీ టీడీపీ అధినేత అంగీకరించలేదని తెలుస్తోంది. 175 స్థానాల్లో 125కు తగ్గకుండా సీట్లు పొందాలని బాబు భావిస్తున్నారు. జనసేనకు 30 నుంచి 40 స్థానాలు ఇచ్చేలా ఉన్నారు. ఇదే విషయమై ఈ సమావేశంలో చర్చించారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఈసారి అధికారం ఖాయమనే విశ్వాసంతో ఉన్న చంద్రబాబు వీలైనన్ని ఎక్కువ స్థానాలు సైకిల్‌కే దక్కేలా వ్యూహం రచించారు. ఇదే వ్యూహాన్ని పవన్‌ ముందుంచారు.


ఇక పార్లమెంట్‌ స్థానాల విషయంలో కూడా జనసేనకు తక్కువ స్థానాలు కేటాయిస్తామనే ప్రతిపాదనను బాబు పవన్‌ ముందుంచారనే వార్త బయటకు వచ్చింది. 25 లోక్‌ స్థానాల్లో ఐదు స్థానాలలోపే ఇస్తామని బాబు చెప్పినట్లు తెలుస్తోంది. కానీ పవన్‌ మాత్రం పదికి తగ్గకుండా పార్లమెంట్‌ స్థానాలను ఆశిస్తున్నారు. మొదట చెరి సగం ప్రతిపాదన రాగా.. జనసేనకు బలం.. బలమైన అభ్యర్థులు లేరనే కారణంతో పవన్‌ వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పావు శాతం కన్నా అధిక స్థానాలు ఆశిస్తున్నారు. మచిలీపట్నం స్థానం మాత్రం ఇటీవల చేరిన బాలశౌరికి కేటాయించాలని పవన్‌ కోరారు. సీట్ల పంపకంపై వీరిద్దరి మధ్య ఇదే తొలి సమావేశం. రెండు, మూడు రోజుల్లో మరోసారి ఈ అంశంపై ఇరువురు నేతలు సమావేశమవుతారని తెలుస్తోంది. తొలి సమావేశంలో సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం రాలేదు. వారం వ్యవధిలో సీట్ల పంపకంపై చర్చించి అనంతరం ఎన్నికల ప్రచారంలోకి దూసుకెళ్లాలని మాత్రం ఇరువురు నాయకులు నిర్ణయించారు. సీట్ల పంచాయితీపై ఎక్కువైనా తక్కువైనా భేదాభిప్రాయాలు లేకుండా ఎన్నికల్లో కలిసి పాల్గొనాలనే అభిప్రాయానికి వచ్చారు. ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకుని జగన్‌ను దింపేయాలని ఇరు నాయకులు నిర్ణయించారు. కాగా సీట్ల పంచాయితీ తేలకుంటే పొత్తు కొనసాగదనే చర్చ కూడా బయటకు వచ్చింది. సీట్ల విషయంలో తగ్గేదేలే అనే ధోరణిలో పవన్‌ ఉన్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook