ఏపీ సీఎం అమెరికా పర్యటన విశేషాలు
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల విషయంలో ఎన్నారైల మద్దతు కూడగట్టేందుకు.. అలాగే అమెరికాలోని ఇతర వాణిజ్యవేత్తలను ప్రత్యేకంగా కలిసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యూఎస్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ విశేషాలపై ప్రత్యేక రిపోర్టు
- మొత్తం తొమ్మిది రోజుల ప్లాన్‌తో ఖరారైన ఈ పర్యటనలో తొలిరోజు చికాగో నగరాన్ని సందర్శించారు ముఖ్యమంత్రి. అక్కడ ఎన్నారైలతో జరిగిన సమావేశంలో విజయవాడ, విశాఖపట్నంలో జరగాల్సిన ఐటి డెవలప్‌మెంట్ గురించి మాట్లాడారు. దాదాపు 60 ఐటి కంపెనీలు ఈ సమావేశంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
- అదేవిధంగా ఐటి సర్వీసులు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్ సర్వీసెస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ మొదలైన రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో కార్యాలయాలు, పరిశ్రమలు ప్రారంభించేందుకు కొన్ని అమెరికన్ కంపెనీలు ఆసక్తి కనబరిచినట్లు సమాచారం.
- ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఐటి సిటీలు ఏర్పాటు చేసే ఐడియా మీద ఐటి టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ గారపాటి ప్రసాద్ సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు. విశాఖను మెగా ఐటిసీటీగా, అమరావతిని మేజర్ ఐటిహబ్‌గా మార్చే ఆలోచనలు ఉన్నట్లు సీఎం తెలిపారు.
- అలాగే తమ ప్రభుత్వం ప్రస్తుతం దాదాపు 100 అవగాహన ఒప్పందాలు చేసుకొనే యోచనలో ఉందని సీఎం అన్నారు. ఈ క్రమంలో మరో 12 నెలల్లో 60 కంపెనీలు విశాఖ, విజయవాడ ప్రాంతాల్లో సేవలు ప్రారంభించే అవకాశం ఉందని తెలియజేశారు. అలాగే మరో 500 సంస్థలు ఏపీ నుండే కార్యకలాపాలు చేసేవిధంగా ప్లానింగ్ చేయనున్నట్లు తెలిపారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ విండో పథకం ద్వారా సంస్థల ఏర్పాటుకు అనుమతిలిస్తూ ప్రోత్సహిస్తుందని.. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పాలనుకొనే ఎన్నారైలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం కోరారు.
- తర్వాత షికాగో స్టేట్ యూనివర్సిటీ ఛైర్మన్ రోహన్ అత్తెలెతో చంద్రబాబు సమావేశమయ్యారు. డైనమిక్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో తమకున్న నైపుణ్యాలను ఏపీలోని విశ్వవిద్యాలయాలకు అందించే యోచన ఉందని ఆయన తెలిపారు.
- తన పర్యటనలో భాగంగా ఏపీ సీఎం డెమోయిన్స్ నగరాన్ని సందర్శించారు. అలాగే ఐయోవా స్టేట్ యూనివర్సిటీ, వర్చువల్ రియాల్టీ అప్లికేషన్ సెంటర్ కూడా సందర్శించారు. తర్వాత మళ్లీ స్టేక్ హూల్డర్ల సమావేశంలో పాల్గొన్నారు. కర్నూల్‌లో నిర్మించే మెగా సీడ్ పార్క్ ప్రాజెక్టు మీద శాస్త్రవేత్తలు, నిపుణులు మరియు అగ్రి కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు.
- చంద్రబాబు పర్యటనలో ఆయనతో పాటు ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి కోమటి జయరాం, మంత్రి యనమల రామక్రిష్ణుడు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సాయిప్రసాద్, ఈడీబీ సీఈఓ జాస్తి క్రిష్ణకిషోర్ తదితరులు పాల్గొన్నారు.