ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఐక్యరాజ్యసమితి అధికారులు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. సెప్టెంబరు 24వ తేదిన న్యూయార్క్‌లో జరగబోయే ఐక్యరాజ్యసమితి సదస్సులో చంద్రబాబు నాయుడు ఉపన్యసించాలని ఆ ఆహ్వానంలో కోరారు.  ‘ఫైనాన్సింగ్‌ సస్టైనబుల్‌ అగ్రికల్చర్‌.. గ్లోబల్‌ ఛాలెంజెస్‌ అండ్‌ ఆపర్చునిటీస్‌’ అనే అంశంపై ఈ సదస్సులో చంద్రబాబు మాట్లాడనున్నారు. ఇప్పటికే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విధానంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తున్న పద్ధతిని ఐక్యరాజ్యసమితి ప్రశంసించడం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే సేంద్రీయ వ్యవసాయ రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ అనునసరిస్తున్న విధానాల పట్ల సమితి హర్షం వ్యక్తం చేసింది. ఏపీలో అనుసరిస్తున్న సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల గురించి గతంలో న్యూయార్క్‌ టైమ్స్‌లో కూడా ఓ ప్రత్యేక కథనం వచ్చింది.  ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం కోసం ఏపీ ప్రభుత్వం ప్రతీ ఏడాది సుమారు రూ.2500 కోట్లు వెచ్చిస్తోందంటూ ఆ కథనంలో తెలపడం జరిగింది. వచ్చే నెల ఐక్యరాజ్యసమితి సదస్సుకి వెళ్తున్న చంద్రబాబు.. న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో కూడా ప్రసంగిస్తారు. 


2024 సంవత్సరానికల్లా 60 లక్షల మంది రైతులను సేంద్రీయ వ్యవసాయ బాట పట్టించడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషికి మద్దతిస్తూ సహాయ సహకారాలు ఇస్తామని గతంలో ఐక్యరాజ్యసమితి మాట కూడా ఇచ్చింది. ఈ క్రమంలో చంద్రబాబు, ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్‌ పాలేకర్‌ సూచనలతో ఆంధ్రప్రదేశ్‌లో పలు కార్యక్రమాలను కూడా నిర్వహించారు.