అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ ఇటీవల మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురవడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు.. అక్కడ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ పలు సంచలన విషయాలు వెల్లడించారు. కిడారి, సోమ మృతిపై ఈ భేటీలో పార్టీ నేతలు సంతాపం ప్రకటించిన అనంతరం చంద్రబాబు పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పార్టీలో తాజాగా చేరిన ఒక వ్యక్తిని మావోయిస్టులు ట్రాప్ చేశారని అన్నారు. అతడు అందించిన సమాచారం ప్రకారమే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సోమ కదలికలపై నిఘా పెట్టారని అన్నారు. అలా ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకే మావోయిస్టులకు వారి వ్యూహరచనలు అమలు చేయడం తేలికైందని చంద్రబాబు స్పష్టంచేశారు. 


మావోయిస్టులు సంచలనం కోసమే ఈ హత్యలు చేశారని చెబుతూ.. బాక్సైట్ తవ్వకాలకు నిరసనగానే మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారనుకున్నట్టయితే, వైఎస్‌ హయాంలోనే ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు ఆమోదం తెలిపిందన్నారు.  తాము అప్పుడైనా, ఇప్పుడైనా బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమేనని చంద్రబాబు తేల్చిచెప్పారు.