నేడు బెంగుళూరు వెళ్లనున్న చంద్రబాబు.. ఇద్దరు కీలక నేతలతో భేటీ!
నేడు బెంగుళూరు వెళ్లనున్న చంద్రబాబు.. ఇద్దరు నేతలతో కీలక భేటీ!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ బెంగుళూరు వెళ్లనున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీల అధ్యక్షులు కీలక నేతలను చంద్రబాబు కలిసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసి, రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే ప్రయత్నాల్లో భాగంగానే చంద్రబాబు ఇవాళ బెంగళూరుకు వెళ్లి మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ సమావేశం అవనున్నారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో కీలక పార్టీలైన సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, లోక్‌తంత్రిక్ జనతా దళ్ పార్టీల అధ్యక్షులతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వంటి వారిని కలిసి మద్దతు కూడగట్టిన చంద్రబాబు దక్షిణాదిలోనూ ఇతర నేతలను కలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే నేడు కర్ణాటక పర్యటన జరుగుతున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక పర్యటన అనంతరం తమిళనాడులో ప్రతిపక్ష నేత అయిన డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను కూడా కలవనున్నట్టు సమాచారం.
ఇప్పటికే ఇటీవల ఢిల్లీలో జరిగిన రాహుల్ గాంధీ - చంద్రబాబుల భేటీని ఎంకే స్టాలిన్ స్వాగతించడంతోపాటు ఆయన కూడా బీజేపీపై స్వతహాగానే గుర్రుగా ఉన్నారు. వీలు చిక్కినప్పుడల్లా బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. స్టాలిన్ విషయంలోనూ గత పరిణామాలను పరిశీలిస్తే, ఆయన సైతం చంద్రబాబుతో కలిసి వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.