చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. శనివారం ఉదయం చెన్నై చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా అక్కడి నుంచి మధ్యాహ్నం సమయానికి అల్వార్‌పేట్‌లోని కావేరి ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి వద్దే ఉన్న ఎం.కే. స్టాలిన్ స్వయంగా ఎదురెళ్లి చంద్రబాబు నాయుడుని దగ్గరుండి ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించి ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి స్టాలిన్‌ని అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కరుణానిధిని పరామర్శించిన సమయంలో ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, పార్టీ నేత వీరమస్తాన్‌ రావు ఆయన వెంటే ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కరుణానిధి ఆస్పత్రిలో చేరిన అనంతరం ఆయన ఆరోగ్యం కొంత విషమంగా మారిందన్న వార్తల నేపథ్యంలో డీఎంకే వర్గాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. అయితే, గత రెండు, మూడు రోజులుగా ఆయన ఆరోగ్యంలో మార్పు కనిపిస్తోందని, కరుణానిధి తిరిగి కోలుకుంటున్నందున పార్టీ వర్గాలు ఆందోళనకు గురికావద్దని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కే. స్టాలిన్ ప్రకటించడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.