AP Rajyasabha Election: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో జగన్ ట్విస్ట్.. కొత్త ముఖాలకు ఛాన్స్?
AP Rajyasabha Election:ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలబలాల ప్రకారం నాలుగు సీట్లు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడనున్నాయి.వైసీపీలో రాజ్యసభ సీట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. పెద్దల సభకు వెళ్లాలని ఆశపడుతున్న నేతలు సీఎం జగన్ ప్రాపకం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
AP Rajyasabha Election: ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఈనెల 24న ఈసీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 31వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నిక అవసరమైతే.. జూన్ 10న పోలింగ్ జరగనుంది. ఏపీకి సంబంధించి ప్రస్తుతం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయి రెడ్డి, బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ తో పాటు ఏపీ నుంచి ఎన్నికైన సురేష్ ప్రభు పదవి కాలం జూన్ 21తో ముగియనుంది. ఈ నాలుగు స్థానాలకు ఎన్నిక జరగబోతోంది. ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలబలాల ప్రకారం నాలుగు సీట్లు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడనున్నాయి.
వైసీపీలో రాజ్యసభ సీట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. పెద్దల సభకు వెళ్లాలని ఆశపడుతున్న నేతలు సీఎం జగన్ ప్రాపకం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పూర్తి చేశారని తెలుస్తోంది. సామాజిక సమీకరణలు, ప్రాంతాలవారీగా జగన్ అభ్యర్థులను ఎంపిక చేశారని సమాచారం. పెద్దల సభకు వెళ్లే నేతల పేర్లను సీఎం జగన్ దాదాపుగా ఫైనల్ చేశారని అంటున్నారు. వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రచారం రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ట్విస్టులు ఉండబోతున్నాయని, కొత్త ముఖాలకు కూడా అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈసారి కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఒకరికి ఛాన్స్ ఉంటుందంటున్నారు.
సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు, వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డికి మరోసారి అవకాశం ఖాయమని తెలుస్తోంది. ఢిల్లీలో సీఎం జగన్ వ్యవహారాలు కట్టబెడతారు విజయసాయి రెడ్డి. కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో సాయిరెడ్డికి రెన్యూవల్ ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. మరో సీటును ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎంపీ కిల్లి కృపారాణికి ఇస్తారని అంటున్నారు. నిజానికి గతంలోనే కృపారాణి పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కాని ఈసారి ఆమెను పెద్దల సభకు పంపడం ఖాయమంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్న కృపారాణితో తమకు రాజకీయంగా కలిసివస్తుందని జగన్ లెక్కలు వేసుకుంటున్నారని టాక్.
కోస్తా నుంచి కొత్త ముఖానికి రాజ్యసభ బెర్త్ దక్కనుందని తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ పేరు వినిపిస్తున్నా.. ఆయనకు ఈసారి కూడా షాక్ తప్పదనే తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ బీద మస్తాన్ రావుకు రాజ్యసభ సీటు ఇవ్వనున్నారని సమాచారం. బీసీ వర్గానికి చెందిన మస్తాన్ రావు గతంలో టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. రెండేళ్ల క్రితమే ఆయన వైసీపీలో చేరారు. రాజకీయంగా, ఆర్థికంగా బలమైన నేతగా ఉన్న మస్తాన్ రావును బీసీ కోటాలో పెద్దల సభకు పంపించాలని జగన్ దాదాపుగా నిర్ణయించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక నాలుగో సీటును బడా వ్యాపారేవత్తగా ఇవ్వనున్నారని తెలుస్తోంది. గతంలో బీజేపీ పెద్దల సూచనతో వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ ఫ్రెండ్ పరిమల్ నత్వానికి రాజ్యసభ సీటు ఇచ్చారు. ఈసారి కూడా కేంద్రం కోటాలో అదానీ కుటుంబానికి ఇవ్వనున్నారట. జగన్ కు సన్నిహితంగా ఉంటే గౌతమ్ అదానీ కాని లేదంటే ఆయన సతీమణి ప్రతీ అదానీకి
ఛాన్స్ రావొచ్చంటున్నారు.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి,సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి పేర్లు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తున్నాయి. దళితుడికి ఇవ్వాలని భావిస్తే మాత్రం చివరి నిమిషంలో మార్పులు జరగవచ్చంటున్నారు. బీసీ కోటాలో ఇద్దరు కాకుండా ఒకరిని ఎంపిక చేసి.. దళిత కోటాలో మరొకరి ఛాన్స్ ఇవ్వొచ్చంటున్నారు. దళితుడికి ఇస్తే ఆ రేసులో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ముందు ఉంటారని అంటున్నారు.
READ ALSO: KA Paul Meets Amit Shah: అమిత్ షాని కలిసిన కేఏ పాల్.. కేసీఆర్, కేటీఆర్‌లకు స్ట్రాంగ్ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook