ప్రధానితో ఏపీ సీఎం భేటీ, పోలవరమే ప్రధాన అజెండా
ఏపీ సీఎం చంద్రబాబు శక్రవారం పీఎంవో కార్యాలయంలో ప్రధాని మోడీతో సమావేశయ్యారు.
ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా విభజన హామీల అమలు, రెవెన్యూ లోటు, పోలవరం అంశాలపై చర్చ జరిగింది. విభజన హామీల అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. వాటిని నెరవేర్చాలంటూ ప్రధానిని గట్టిగా కోరారు. రాష్ట్రానికి దక్కాల్సిన అన్నింటినీ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
పోలవరాన్ని కేంద్రమే భరించాలి..
పోలవరం అంశాన్ని లేవనెత్తిన చంద్రబాబు ఈ ప్రాజెక్టును భరించే శక్తి రాష్ట్రానికి లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రత్యామ్నాయ వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి రాసిన లేఖ గురించి ఈ సందర్భంగా చంద్రబాబు ప్రధాని ముందు ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ. 58 వేల 319 కోర్టు ఖర్చవుతుందుందని..పునరావాసం కోసమే దాదాపు రూ. 33 వేల 858 కోట్లు అవరసరమన్నారు... దీన్ని కేంద్రమే భరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రధానికి విన్నవించారు.
రెవెన్యూ లోటును పూడ్చండి..
ఈ భేటీలో చంద్రబాబు రెవెన్యూ లోటు అంశాన్ని ప్రస్తావించారు. తొలి ఏడాది రెవెన్యూ లోటు రూ. 16 వేల 78 కోట్లు ఉందని గుర్తు చేశారు. రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 7 వేల 500 కోట్లు ఇస్తామంటూ భరోసా ఇచ్చిందని.. అయితే కేవలం రూ. 3 వేల 979 కోట్లు మాత్రమే ఇచ్చిందని ప్రధానికి తెలిపారు. మిగిలిన మొత్తాన్ని వెంటనే ఇవ్వాలని కోరారు. అలాగే విదేశీ ప్రాజెక్టుల ప్రతిపాదనలు దాదాపు మొత్తం రూ. 19 వేల వరకు ఉందని ... వీటిలో రూ. 8 వేల 349 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారని ..మిగిలిన ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలపాలని విన్నవించారు
విభజన హామీల సంగతేంటి ..
ఇదే సందర్భంలో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని మరోకసారి చంద్రబాబు ప్రధాని మోడీని కోరారు. అలాగే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. విభజన హామీ మేరకు రాష్ట్రంలో నిర్మించాల్సిన 11 జాతీయ విద్యా సంస్థల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.