అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్‌కి కీలక బాధ్యతలు అప్పగించారు. పాత్రికేయ వృత్తిలో అమర్‌కి ఉన్న అనుభవం దృష్ట్యా ఆయనను రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మీడియా సలహాదారుగా నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ మీడియా, పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు, తదితర వ్యవహారాల్లో దేవులపల్లి అమర్ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించనున్నారు. దేవులపల్లి అమర్‌ని జాతీయ మీడియా సలహాదారుగా నియమించిన ఏపీ సర్కార్.. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్టుగా ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.


1976లో ఈనాడు దినపత్రిక ద్వారా పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించిన అమర్... తన 43 ఏళ్ల కెరీర్‌లో ఆంధ్ర భూమి, ఆంధ్ర ప్రభ పత్రికల్లో కీలక హోదాల్లో పనిచేశారు. ప్రజాతంత్ర పత్రిక వ్యవస్థాపక సంపాదకుడిగా సేవలు అందించారు. ప్రస్తుతం అమర్ సాక్షి టీవీలో ''ఫోర్త్ ఎస్టేట్'' పేరిట వారానికి ఐదు రోజులు ప్రసారమయ్యే ఓ కార్యక్రమాన్ని నిర్వహించడంతో సాక్షి దిన పత్రికకు కన్సల్టింగ్ ఎడిటర్‌గానూ పనిచేస్తున్నారు. 2004 నుంచి 2009 వరకు ఐదున్నరేళ్లపాటు ఉమ్మడి ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా కేబినెట్ ర్యాంక్ హోదాలో పనిచేశారు. గతంలో ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజేయూ) ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అమర్ ప్రస్తుతం ఐజేయూ అధ్యక్షుడిగా ఉన్నారు.