అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే, సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని ప్రకటించిన వైఎస్ జగన్.. ఇచ్చిన మాటకు అనుగుణంగానే ముఖ్యమంత్రి అయిన మూడో రోజే మద్య నిషేధం దిశగా తొలి అడుగు వేశారు. మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నామని మరోసారి పునఃరుద్ఘాటిస్తూనే మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాల్సిందిగా సంబంధిత అధికారులకు జగన్‌ ఆదేశాలు జారీచేశారు. 


ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో శనివారం సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు.. ఎపిలో ఉన్న బెల్టు షాపులను ఎత్తివేయాల్సిందిగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలని సూచిస్తూ సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత లేకుండా చూడాలనీ, ఆర్థిక క్రమ శిక్షణను పాటించాలని జగన్‌ స్పష్టంచేశారు. మద్యనిషేదం దిశగా జగన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.