అమరావతి: ఏపీకి కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తనదైన ముద్ర చాటుకునేలా రోజుకో సంచలనం నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ వైఎస్సార్సీపీఎల్పీ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి పార్టీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవగా వారికి వైఎస్ జగన్ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.


వైఎస్సార్సీపీఎల్పీ సమావేశం సందర్భంగా మొత్తం 25 మంది మంత్రులతో కేబినెట్ ఏర్పాటు చేయనున్నట్టు తేల్చిచెప్పిన జగన్.. కేబినెట్‌లో చోటుదక్కలేదనే అసంతృప్తి కలగకుండా ఉండేందుకు రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్‌లో 90శాతం మంది మంత్రులను మార్చడం జరుగుతుందని స్పష్టంచేశారు. వైఎస్ జగన్ చేసిన ప్రకటనను పరిశీలిస్తే, ప్రస్తుతం కేబినెట్‌లో చోటు దక్కని వారికి రెండున్నరేళ్ల తర్వాత అవకాశం ఇవ్వనున్నామని సంకేతాలిచ్చినట్టు అర్థమవుతోంది.