AP CS Sameer Sharma News: ఆంధ్రప్రదేశ్ సర్కారుకు కేంద్రానికి మధ్య ఏం నడుస్తోందంటున్నారు నెటిజెన్స్. అందుకు కారణం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలం మరో ఆరు నెలల పొడిగింపునకు అనుమతి ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడమే. అవును... నవంబర్ 30 వరకు సమీర్ శర్మనే ఏపీ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. సమీర్ శర్మ పదవీ కాలాన్ని ఇలా పొడిగించడం ఇదేం మొదటిసారి కాదు.. ఇలా జరగడం ఇది ఏకంగా రెండోసారి. సరిగ్గా ఇదే అంశం చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. కేంద్రానికి, ఏపీ సర్కారుకు మధ్య ఏం జరుగుతోంది అని చర్చించుకునేలా చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమీర్ శర్మనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించాలని ఏపీ సర్కారు భావించడం ఇందులో ఒక అంశమైతే.. ఏపీ సర్కారు విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఇక్కడ పరిశీలకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇలా జరగడం సర్వసాధారణమైన అంశమైతే అది వేరే విషయం. కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఈ తరహాలో ఆరు నెలల కంటే ఎక్కువగా రెండుసార్లు పదవీ కాలం పొడిగింపు పొందిన ఏకైక సీఎస్‌గా సమీర్ శర్మనే నిలవడమే ఇక్కడ ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చీఫ్ సెక్రటరీలుగా సేవలు అందించిన వారికి మాత్రమే ఈ గుర్తింపు దక్కగా ఆ తర్వాతి స్థానంలో ఏపీ సీఎస్ సమీర్ శర్మనే కొనసాగుతున్నారు.


ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల సేవల విషయంలో వారి పదవీ కాలం పొడిగింపు విషయంలో నిర్ణయం వెలువడేది డీవోపిటీ విభాగం నుంచే అయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో కీలకంగా వ్యవహరించే చీఫ్ సెక్రటరీల స్థాయి వారి పదవీకాలం పొడిగింపు అనేది మాత్రం ప్రధాని కార్యాలయం జోక్యం లేకుండా జరిగే పని కాదనే అభిప్రాయం ఎలాగూ ఉండనే ఉంది. ఏ విధంగా చూసినా.. ప్రధాని కార్యాలయం ప్రమేయం లేకుండానే ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలం పొడిగింపు అనేది సాధ్యపడే అంశం కాదంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరడం, ఆ వెంటనే కేంద్రం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకోవడం వెనుకున్న కారణం ఏమై ఉంటుందా అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.


ఇదంతా ఇలా ఉంటే.. ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలం పొడిగింపు విషయంలో సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించడానికి.. త్వరలోనే జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ఏమైనా సంబంధం ఉందా అనేది ఇంకొంత మంది అనుమానం. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపి అభ్యర్థి గెలుపు కోసం ఆ పార్టీ వైఎస్ఆర్‌సీపీ సహాయం కోరే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇప్పటికే పలు వార్తా కథనాలొస్తున్నాయి. ఈ లెక్కన ఒకవేళ బీజేపీకి వైఎస్సార్సీపీతో పని పడే అవకాశమే ఉన్నట్టయితే.. ఆ పార్టీ అడిగిన సహాయం కూడా చేయకతప్పని పరిస్థితి కూడా ఉన్నట్టే అనేది పరిశీలకుల వాదన. మరి ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరగనుందనే వేచిచూడాల్సిందే.