సీబీఐ అంటే మాకు ఎలాంటి భయమూ లేదు: ఏపీ డిప్యూటీ సీఎం
సీబీఐ అన్నా, సీబీఐ దర్యాప్తులన్నా తమకు ఎలాంటి భయమూ లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు.
సీబీఐ అన్నా, సీబీఐ దర్యాప్తులన్నా తమకు ఎలాంటి భయమూ లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సీబీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి దర్యాప్తులు చేయాలన్నా.. అవినీతిపై చర్యలు తీసుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన తెలిపారు. తాము ఎవరికీ భయపడి సీబీఐకి అనుమతిని నిరాకరించలేదని చినరాజప్ప స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఇంకా అనేక రాష్ట్రాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాయని డిప్యూటీ సీఎం వివరణ ఇచ్చారు.
అయితే కేంద్రం రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికి కొన్ని దురాలోచనలు చేస్తుందని.. కానీ తాము ధైర్యంగానే ముందుకు పోతామని.. భయం లేకుండా పనులు చేస్తామని రాజప్ప అన్నారు. ఇటీవలే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టకూడదని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరిస్తుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తాను ఏకీభవించలేనని మాజీ సీబీఐ అధికారి జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అవినీతి పరులకు వరంగా మారే అవకాశముందని ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. అవినీతి నిర్మూలనకు ఈ నిర్ణయం గొడ్డలి పెట్టుగా మారే ఛాన్స్ ఉందన్నారు. సీబీఐ స్థానంలో ఏసీబీ సోదాలు నిర్వహించే అధికారం ఉన్నన్నప్పటికీ అది మరింత కష్టమైన పని అని.. ఎక్కడో ఒక చోట తప్పు జరిగిందనే కారణంతో ఏకంగా వ్యవస్థనే బహిష్కరించడం సరైంది కాదని జేడీ తెలిపారు.