Balineni Srinivas Reddy: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొంత కాలంగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. సీఎం జగన్ కు సమీప బంధువైన శ్రీనివాస్ రెడ్డి వైసీపీలో మొదటి నుంచి కీ రోల్ పోషించారు. జగన్ మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కింది. మంత్రివర్గ పునర్ వ్యవస్థికరణలో ఆయన పదవి కోల్పోయారు. అప్పటి నుంచి సొంత పార్టీపైనే తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కాక రాజేస్తున్నారు బాలినేని. దీంతో ఆయన వైసీపీ దూరం కానున్నారా అన్న చర్చ సాగుతోంది. తాజాగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలో చేరబోతున్నారా అన్న ప్రచారం తెరపైకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. చేనేత వస్త్రాలు ధరించి ఆ ఫోటోలు పోస్ట్ చేయాలని సూచించారు. కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన పవన్ కల్యాణ్.. మరో ముగ్గురిని అందులోనామినేట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తో పాటు బాలినేని వాసును నామినేట్ చేశారు పవన్. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. బాలినేని వాసు అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఏపీ మాజీ మంత్రి, సీఎం జగన్ కు సమీప బంధువు. వైసీపీ నేత అది కూడా జగన్ సమీప బంధువును పవన్ తన చేనేత ఛాలెంజ్ కు నామినేట్ చేయడం చర్చగా మారింది. పవన్ నామినేట్ చేసిన వారిలో ఒకరు చంద్రబాబు.. మరొకరు లక్ష్మణ్. ఏపీ చేనేత మంత్రికి నామినేట్ చేసినా ఓ లెక్క ఉంటుంది. కాని ప్రస్తుతం మంత్రిగా లేని బాలినేనికు పవన్ ఎందుకు చేనేత ఛాలెంజ్ చేశారన్నది చర్చగా మారింది.



పవన్ ట్వీట్ తో ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. కొంత కాలంగా వైసీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న  బాలినేని జనసేన పార్టీలో జంప్ చేయాలని చూస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కల్యాణ్ తోనూ ఆయన మాట్లాడుతున్నారని తెలుస్తోంది.ఇటీవలే బాలినేని శ్రీనివాసు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత పార్టీకి చెందిన నేతలపైనే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.తనపై కొందరు వైసీపీ నేతలు కావాలనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలు. ఉన్నాయన్నారు బాలినేని. తనపై కుట్రలు చేస్తున్నవారి పేర్లను త్వరలోనే బయటపెడతానని చెప్పారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తుంటే.. టీడీపీ నేతలకు కొంత మంది వైసీపీ నాయకులు సహకరిస్తున్నారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న కుట్రలో సొంత పార్టీ నేతలు ఉన్నారని తెలిసి సిగ్గుపడుతున్నానని బాలినేని తెలిపారు. వైసీపీలో టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డితో బాలినేనికి మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి. తాజాగా బాలినేని చేస్తున్న కామెంట్లు వైవీ టార్గెట్ గానే చేశారంటున్నారు. మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ అధినేతను ధిక్కరించే వరకు వెళ్లారు బాలినేని. ప్రకాశం జిల్లకు చెందిన  ఆదిమూలపు సురేష్ ను కేబినెట్ లో కొనసాగిస్తూ.. తనను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం సాగింది. అయితే సీఎం జగన్ నుంచి పిలుపు రావడంతో కూల్ అయ్యారు.


ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి... తనకు పవన్ కల్యాణ్ తో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. పవన్ పై తనకు గౌరవం ఉందన్నారు. పవన్ ను ఉద్దేశించి బాలినేని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. తాజాగా చేనేత దినోత్సవం సందర్భంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి పవన్ కల్యాణ్ ఛాలెంజ్ చేయడం ఆసక్తి రేపుతోంది. కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం త్వరలోనే నిజం కాబోతోంది.. వైసీపీలో తీవ్ర అసంతృప్తిగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే పవన్ కల్యాణ్ పార్టీలో చేరడం ఖాయమని చెబుతున్నారు. 


Read also: Pawan Kalyan: కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన పవన్ .. వైసీపీ నేత బాలినేనిని నామినేట్ చేసిన జనసేన చీఫ్


Read also: ISRO: నాలుగో దశలో మిస్సైన సిగ్నల్.. ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగం విఫలం?