నీటి పారుదల రంగంలో ‘స్టేట్ ఆఫ్ ది ఇయర్’గా ఆంధ్రప్రదేశ్‌కు ప్లాటినమ్ అవార్డు, 19 స్కోచ్ పురస్కారాలు లభించాయి. ఈ మేరకు జలవనరుల శాఖ మంత్రి, కార్యదర్శి, ఇంజినీర్లు, అధికారులు, ఉద్యోగులందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ అవార్డులను జలవనరుల శాఖతో పాటు ప్రజలకు కూడా అంకితమిస్తున్నట్లు తెలిపారు. వరల్డ్ వాటర్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద పీట వేయడం, 116 రోజుల జలసంరక్షణ ఉద్యమానికి నాంది పలకడం, "జలసిరికి హారతి" లాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే.. ఏపీ ముందంజలో ఉండి ఈ సంవత్సరం "స్టేట్ ఆఫ్ ది ఇయర్" పురస్కారం అందుకుంది. 


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ "జల భారతి" పేరుతో ఓ మాస పత్రికను కూడా నడుపుతోంది. అలాగే "నీరు-ప్రగతి" కార్యక్రమాలలో భాగంగా రాష్ట్రంలో సాగు నీటి సమస్యలకు పరిష్కారాలను కూడా అందిస్తోంది. ఇటీవలే పట్టిసీమ ద్వారా క్రిష్ణా, గోదావరి అనుసంధానం గావించిన స్ఫూర్తితో రాష్ట్రంలోని మిగులు ఉన్న ప్రాంతాలను గుర్తించి, లోటు ప్రాంతాలకు నీటిని పంపడానికి ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రవహించే నదులు, ఉపనదులను ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అనుసంధానించటానికి వీలవుతుందో అధ్యయనం చేయాలని కూడా నీరుపారుదల శాఖ ప్రకటించింది.