తెలుగు భాషకు అందలం
అమ్మభాషకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని చంద్రబాబు తన నిర్ణయాన్ని ప్రకటించారు. తాజా నిర్ణయం అమల్లోకి వస్తే ఇంటర్‌లో ద్వితియ భాషగా తెలుగును తప్పనిసరిగా ఎంచుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్న విధానంలో పదవ తరగతి వరకు తెలుగు భాష ప్రధమ భాషగా ఉంది. అయితే ఆ తర్వాత తెలుగు ఊసే లేకుండా పోయింది. ఇంటర్ లో తెలుగును ద్వితియ భాషగా ఎంచుకునే వీలున్పప్పటికీ..మార్కుల మోజులో పడి ఎక్కువ శాతం విద్యార్ధులు తెలుగును పక్కన పెడుతున్నారు.తాజా నిర్ణయంతో ఇక తెలుగు ద్వితియ భాషగా ఎంచుకోవడం తప్పనిసరైంది.
తెలుగు నేలపై తెలుగు భాషకు ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతూ వస్తోంది. కార్పోరేట్ వర్గాల రంగ ప్రవేశంతో బడుల్లో దాదాపు తెలుగు భాషకు మంగళపాడేశారు. మార్కుల మోజులోపడి సంస్కృతం, ఇతర బాషలను విద్యార్ధులపై బలవంతంగా రుద్దుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ఏపీ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కేసీఆర్ బాటలో చంద్రబాబు..
ఇటీవలే తెలంగాణలో ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిచేసిన విషయం తెలిసిందే. బాషను బతికించుకోవాలనే ఉద్దేశంతో టి.సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా దీన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా మండలి బుద్ధప్రసాద్, పరకాల ప్రభాకర్ సహా పలువురు భాషావేత్తలు ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.