కర్నూలు జిల్లాలో గుప్త నిధుల ఆశ ఫలించేనా..?
చెన్నంపల్లి, ఇది కర్నూలు జిల్లా కోయిలకుంట్ల తాలూకాలో ఉన్న గ్రామం. ఇక్కడ ఒక రాజుల కాలంనాటి పురాతన కోట ఉంది.
కర్నూలు జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ఫ్యాక్షన్ గొడవల్లో కాదు సుమీ..! కర్నూలు జిల్లాలో వర్షాలు కురిశాక లేదా అప్పుడప్పుడు పత్తికొండ, తుగ్గలి, రామళ్లకోట తదితర ప్రాంతాల్లో వజ్రాలు, రత్నాలు, బంగారం దొరుకుతుంటుందని మీకందరికీ తెలుసు.. అవునా!!
ఇప్పుడు అదే కోవలోకి చెందినదే చెన్నంపల్లి. ఇది కర్నూలు జిల్లా కోయిలకుంట్ల తాలూకాలో ఉన్న గ్రామం. ఇక్కడ ఒక రాజుల కాలంనాటి పురాతన కోట ఉంది. అందులో బంగారం, వజ్రాలు, నిధినిక్షేపాలు ఉన్నాయన్న సమాచారంతో రాష్ట్రప్రభుత్వం గత 12 రోజులుగా తవ్వాకాలు జరుపుతోంది. ప్రభుత్వం కోట పరిసరాల్లో సీసీ కెమెరాలు బిగించి భద్రతను కట్టుదిట్టం చేసింది.
తవ్వకాల్లో మొదట ఇటుకలు, జంతువుల ఎముకలు, పుర్రెలు, ఏనుగు దంతాలు బయటపడ్డాయి. తాజాగా రాజులు వాడిన ఖడ్గాలు, పిడిబాకులు, ఒక శిల్పం కనిపించింది. అయితే నిధులు ఉన్నట్లు ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు. బయటపడిన అవశేషాలను పురావస్తు శాఖకు పంపించి పరీక్షలు జరుపుతున్నారు. కాగా, చెన్నంపల్లి కోటను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో చేర్చాలని న్యాయవాదులు, చరిత్రకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.