Salarys Cut: ఉద్యోగులకు పీఆర్సీ చాలా కీలకం. పీఆర్సీతోనే వేతనాలు పెరుగుతాయ్. అందుకే పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు ఉద్యమిస్తుంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. పీఆర్సీ ఇస్తే ఉద్యోగులకు వేతనాలు పెరగాల్సింది పోయి తగ్గే పరిస్థితి వచ్చింది. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం షాకిచ్చింది. ప్రజా రవాణా శాఖగా మారిన ఆర్టీసీ ఉద్యోగులకు ఫిట్ మెంట్ పెంచకపోగా.. ప్రస్తుతం ఉన్న దాంట్లోనే కోత పెట్టింది. ఆర్టీసీ ఉద్యోగుల ఫిట్‌మెంట్‌ లో  1.6 శాతం కోతపెట్టింది ఏపీ ప్రభుత్వం. డీఏలోనూ కోత పెట్టింది. 4.7 శాతం డీఏ కలపాల్సి ఉండగా.. 1.6 శాతం కట్ చేసి 3.1 శాతాన్నే ఆర్టీసీ ఉద్యోగుల మూల వేతనంలో కలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను 2020, జనవరిలో ప్రభుత్వంలో విలీనం చేసుకుంది వైసీపీ ప్రభుత్వం. వాళ్లను పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ లో చేర్చింది. అయితే  ఇంతవరకు కేడర్ కేటాయించలేదు. తాజాగా పీటీడీ ఉద్యోగుల స్కేళ్లు ఖరారు చేసింది. దాంతో పాటు పీఆర్సీ అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడే ఉద్యోగులకు షాకిచ్చింది. కార్మికులకు లబ్ది పొందేలా అశుతోష్‌మిశ్రా కమిటీ ఇచ్చిన వివిధ సిఫార్సులను పక్కనపెట్టింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదికలోని స్కేళ్లను ఖరారు చేసింది. ఫిట్‌మెంట్‌ ను తగ్గించింది. డీఏలోనూ కోత పెట్టింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు తగ్గాయి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు ఎక్కడా లేదని తెలుస్తోంది.


ఏపీ ప్రభుత్వ  ఉద్యోగులకు జూలై 2018 నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చింది.  ఆర్టీసీ ఉద్యోగులు 2020, జనవరిలో విలీనమయ్యారు. 2017లో ఆర్టీసీలో 25 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. పీఆర్సీలో ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. దీంతో  పీటీడీ ఉద్యోగులకు  గతంలో ప్రకటించిన 25 శాతం ఫిట్‌మెంట్‌కు అదనంగా 1.6 శాతం  కలపాలని అశుతోష్‌మిశ్రా కమిటీ సిఫార్సు చేసింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు 23 శాతమే ఫిట్‌మెంట్‌ ఇవ్వడంతో ఇప్పుడు ప్రడా రవాణా ఉద్యోగులకు 1.6 శాతం ఫిట్ మెంట్ తగ్గించారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. 1.6 శాతం ఫిట్ మెంట్ కోత పెట్టడంతో  పీటీడీలో ఈడీ స్థాయి నుంచి ఏడీ స్థాయి వరకు మూల వేతనం తగ్గింది. డిపో మేనేజర్‌ నుంచి కిందిస్థాయి ఉద్యోగికి మాత్రం బేసిక్‌ పెరిగింది.


ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించినట్లే ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌ స్కీమ్‌  పీటీడీ ఉద్యోగులకు అమలు కానుంది. ఆర్టీసీలో స్పెషల్‌ గ్రేడ్లు 9, 18 ఏళ్లకు ఉండగా.. పీటీడీలో 6, 12, 18, 24 ఏళ్లకు మార్చారు. పీటీడీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వ జీవిత బీమా వర్తించనుంది. ఆర్టీసీలో ఉన్నట్లే విజయవాడలోని ఆర్టీసీ సెంట్రల్‌ ఆసుపత్రి, ఏరియా డిస్పెన్సరీలలో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి.  ఈపీఎఫ్‌-95,  సీపీఎస్‌ లో ఏది ఎంచుకుంటారో ఆప్షన్ ఇస్తారు. సీపీఎస్‌లో చేరేతే ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా డీసీఆర్‌జీ పథకం అమలవుతుంది.  ఈపీఎఫ్‌-95 ఆప్షన్ తీసుకుంటే.. ఏపీఎస్‌ఆర్టీసీ గ్రాట్యూటీ విధానమే అమలవుతుంది.  ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగానే పీటీడీ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్, డెత్‌ రిలీఫ్‌, స్వచ్ఛంద పదవీ విరమణ ప్రయోజనాలు వర్తిస్తాయి.


పీఆర్సీ అమలు, కేడర్‌ ఖరారులో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని పీటీడీ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఫిట్‌మెంట్‌ తగ్గిస్తూ డీఏలో కోతపెట్టడం ఏంటని నిలదీస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులుగా 25 శాతం ఫిట్‌మెంట్‌ పొందామని.. అంతకంటే పెంచాలి గాని తగ్గించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీలో ఉంటేనే తమకు జీతాలు పెరిగేవని.. అలానే కొనసాగితే బెటరనే అభిప్రాయం కొందరు ఉద్యోగుల నుంచి వస్తోంది.


READ ALSO: Gang Rape Update: మైనర్ బాలికపై ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం! ఆధారాలు చూపించిన రఘునందన్ రావు..


READ ALSO: BIG BREAKING: ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల వాయిదా...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook