హైదరాబాద్: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. వోక్స్‌వ్యాగన్ కుంభకోణం కేసులో మంత్రి బొత్సకు సీబీఐ ఈ నోటీసులు జారీచేసింది. సెప్టెంబర్ 12న మంత్రి బొత్సను తమ ఎదుట హాజరుకావాల్సిందిగా సీబీఐ కోర్టు ఈ నోటీసుల్లో పేర్కొంది. 2005లో విశాఖపట్నంలో కార్ల తయారీ ఫ్యాక్టరీ స్థాపనకు వోక్స్‌వ్యాగన్‌కు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వశిష్ట వాహన్‌కు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 11 కోట్ల రూపాయలు చెల్లించింది. అయితే, ఈ చెల్లింపు జరిగిన అనంతరం వశిష్ట వాహన్ సీఈవో సూష్టర్‌తో తమకు ఏ విధమైన సంబంధం లేదని వోక్స్‌వ్యాగన్ ప్రకటించింది. వోక్స్‌వ్యాగన్ చేసిన ఈ ప్రకటనతో కుంభకోణం బయటపడటమే కాకుండా అప్పుడు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వోక్స్‌వ్యాగన్ పోనాది ఏటి సేత్తాం అంటూ అప్పట్లో మంత్రి బొత్స చేసిన ప్రకటన సైతం ఆయన్ను తీవ్ర అభాసుపాలు చేసింది. ఈ వరుస పరిణామాల అనంతరం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 


అలా తెరమరుగైన ఈ కేసులో ఇన్నేళ్ల తర్వాత బొత్స సత్యనారాయణకు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.