తెలంగాణలో ఏపీ మంత్రి ప్రచారం ; సుహాసిని కోసం రంగంలోకి దిగిన పరిటాల సునీత
తెలంగాణలో టి.టీడీపీ ఎన్నికల ప్రచారం ఉధృతం చేసింది. తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం కోసం ఆంధ్రప్రదేశ్ నేతలను సైతం బరిలోకి దించుతోంది. ఈ క్రమంలో పరిటాల సునీత రంగంలోకి దిగారు. ఆమె రెండు రోజుల పాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
ప్రస్తుతం ఆమె నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న కూకట్‌పల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ నందమూరి కుటుంబానికి తన కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగానే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని పరిటాల సునీత పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఏపీ మంత్రిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణ ఎన్నికల్లో ఏపీ మంత్రి పాల్గొనడంపై చర్చనీయంశంగా మారింది. పరిటాల సునీత ప్రచారం సుహాసిని ఏ మేరకు కలిసి వస్తుందనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఏపీ నుంచి స్థిరపడిన వారు ఉండటంతో సునీత ప్రచారం తమకు కలిసి వస్తుందని తెలంగాణ టీడీపీ వర్గాలు వాదిస్తున్నాయి. ఏపీ మంత్రి ప్రచారంతో టీ టీడీపీ సెల్ఫ్ గోల్ చేసుకుంటోందని టీఆర్ఎస్ వర్గాలు వాదిస్తున్నాయి.