ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచె ఐలయ్యకు ఏపీ పోలీసుల నుంచి నోటీసులు అందాయి. విజయవాడ డీసీపీ క్రాంతి రాణా పేరుతో వచ్చిన ఈ నోటీసులో రేపు ఆయన పాల్గొనబోయే ‘కంచె ఐలయ్య సంఘీభావం’  సభకు అనుమతి మంజూరు చేయడం లేదని తెలిపారు. ఆర్యవైశ్య ప్రతిఘటన సభ కూడా అదే రోజు ఉండడం వల్ల భద్రతా సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు. ఒకవేళ నోటీసులు బేఖాతరు చేసి సభకు వస్తే అరెస్టు చేస్తామని ఐలయ్యను పోలీసులు హెచ్చరించారు. ఇదే విషయంపై ఐలయ్య స్పందించారు. తమ సభను అడ్డుకోవడం ప్రజాస్వామిక విలువలను తుంగలో తొక్కడమేనని చెప్పారు. రేపు సభను పోలీసులు అడ్డుకుంటున్న సందర్భంలో టీమాస్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన దాదాపు గంట సేపటికే తార్నాక ప్రాంతంలోని ఐలయ్య ఇంటి వద్ద పోలీసు బలగం మోహరించబడింది. విజయవాడ జింఖానా మైదానంలో ఎలాంటి సభలు చేయడానికి తాము అనుమతి ఇవ్వలేదని, ఐలయ్య అనుయాయులతో పాటు ఆర్య వైశ్య ప్రతిఘటన సభ నిర్వాహకులకు కూడా తాము అనుమతి నిరాకరిస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమీషనర్ తెలిపారు. విజ‌య‌వాడ న‌గ‌రంలో సెక్షన్ 144 విధిస్తున్నట్లు ఆయన చెప్పారు.