విశాఖ వేదికగా ఏపీ సైన్స్ కాంగ్రెస్
విశాఖపట్నంలోని ఆంధ్రవిశ్వవిద్యాలయ వేదికగా జరిగే ఆంధ్రప్రదేశ్ సైన్సు కాంగ్రెసు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నవంబరు 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఏయూ సెనేట్ మందిరంలో జరిగే ఈ కాంగ్రెస్కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 ప్రతినిధులు హాజరవుతున్నారు.
అలాగే 60 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు తన ప్రసంగాలను అందిస్తారు. ఇదే కార్యక్రమంలో భాగంగా జరిగే చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ 7వ తేదీన ఉదయం 9 గంటలకు ఏయూ టీఎల్ఎన్ సభామందిరంలో ప్రారంభమవుతుంది. చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్లో 150 పాఠశాలలు పాలుపంచుకోనున్నాయి.
ఈ ఏపీ సైన్స్ కాంగ్రెస్లో 10 మంది యువ శాస్త్రవేత్తలకు పురస్కార ప్రదానం జరుగుతుంది. సివి రామన్ అవార్డు, ఎన్ జీ రంగా అవార్డు, మేడమ్ క్యూరీ అవార్డు మొదలైన పురస్కారాలను ఈ కార్యక్రమంలో యువ శాస్త్రవేత్తలకు అందివ్వనున్నట్లు కాంగ్రెస్ నిర్వాహకులు ప్రకటించారు.
ఈ సైన్స్ కాంగ్రెస్లో భాగంగా జరిగే మూడు రోజుల ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏయూ ప్లాటినమ్ జూబ్లీ గెస్టుహౌస్ వద్ద జరుగుతుంది. గతంలో సైన్స్ కాంగ్రెస్ను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మొదలైన యూనివర్సిటీలు నిర్వహించాయి. ఈ సైన్స్ కాంగ్రెస్ను నిర్వహించడానికి ప్రభుత్వం 50 లక్షలు కేటాయించింది.