ఏపీ స్పీకరు ఇంటికి... తెలంగాణ స్పీకరు గెస్ట్..!
ఏపీ స్పీకరును ఇంటికి... తెలంగాణ స్పీకరు గెస్ట్..!
తెలంగాణ సభాపతి సిరికొండ మధుసూదనచారి ఈ రోజు కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాదరావు నివాసానికి వచ్చారు. ఆయనకు కోడెల ఘనస్వాగతం పలికి ఇంట్లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఇరువురు కూడా తమ తమ కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. తన ఇంటికి విచ్చేసిన సందర్భంగా మధుసూదనాచారిని, కోడెల దుశ్శాలువతో సత్కరించారు. చిత్రమేమిటంటే.. ఈ ఇద్దరు సభాపతులు కూడా తెలుగుదేశం పార్టీ నుండే రాజకీయ ప్రస్థానం ప్రారంభించడం విశేషం.
మధుసూదనాచారి మొదటి సారిగా 1994-99 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికై తొలి సారిగా చట్టసభలో ప్రవేశించారు. 1983లో రాజకీయాల్లోకి వచ్చిన కోడెల అప్పటి ఎన్నికల్లో నర్సరావుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి వరుస విజయాలు నమోదు చేశారు. కాగా, తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీడీపిని విడిచి పెట్టిన మధుసూదనాచారి, 2014 సాధారణ ఎన్నికలలో వరంగల్ జిల్లా భూపాలపల్లి నుంచి టిఆర్‌ఎస్ పార్టీ టికెట్‌పై ఎన్నికయ్యారు. కోడెల అదే ఎన్నికల్లో 2014లో సత్తెనపల్లి నుంచి గెలుపొంది ఏపీ సభాపతిగా ఎన్నికయ్యారు.