ఏపీ టెట్‌లో మార్పులు; నోటిఫికేషన్ విడుదల
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ప్రకటనను ఏపీ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం జారీ చేసింది.
అమరావతి: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ప్రకటనను ఏపీ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం జారీ చేసింది. ఈసారి టెట్ స్వరూపంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పరీక్షను ఇకపై పేపర్-1, పేపర్-2 ఏ, పేపర్-2 బీలుగా నిర్వహిస్తారు. ఎన్‌సీటీఈ మార్గదర్శకాలను అనుసరించి ఈ మేరకు స్వల్ప మార్పులు చేశారు. పేపర్-1ను ఎస్జీటీలకు, పేపర్-2(ఏ)ను గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం, భాషా పండితులకు, పేపర్-2(బీ)ని వ్యాయామ ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తారు. అన్ని పేపర్లు కూడా 150 మార్కులకే నిర్వహిస్తారు.
అభ్యర్థులు ఒక్కసారి దరఖాస్తును పూర్తి చేసి, ఆన్‌లైన్‌లో సమర్పిస్తే ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తులో తప్పుగా నమోదు చేస్తే మరోసారి కొత్తగా దరఖాస్తు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇందుకు అదనంగా మరో రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
షెడ్యూల్ వివరాలు:
- ఆన్‌లైన్ దరఖాస్తు రుసుములు చెల్లింపు: మే 5 నుంచి ఈ నెల 22 వరకు
- దరఖాస్తులు: మే 5 నుంచి ఈ నెల 23 వరకు
- ఆన్‌లైన్ సన్నాహక పరీక్ష (మాక్‌టెస్ట్): 25 నుంచి
- హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: జూన్ 3 నుంచి
- పేపర్-1 పరీక్ష: జూన్ 10 నుంచి 12 వరకు
- పేపర్-2(ఏ): జూన్ 13 నుంచి 15 వరకు, జూన్ 17 నుంచి 19 వరకు
- పేపర్-2(బీ): జూన్ 21
- ప్రాథమిక ‘కీ’ విడుదల: జూన్ 22
- అభ్యంతరాల స్వీకరణ: జూన్ 26 వరకు
- తుది‘కీ’ విడుదల: జూన్ 28
- ఫలితాలు: జూన్ 30