ఏపీలో రాజకీయ అనిశ్చితి నెలకొందా అంటే అవుననే సమాధానం వస్తోంది. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. సంక్షేమ పథకాల్ని ఇంటి వద్దకు తెచ్చిన అధికార పార్టీ వ్యతిరేకత మూటగట్టుకుంటే..ఆ వ్యతిరేకతను సానుకూలంగా మల్చుకునే పరిస్థితి ప్రతిపక్షం తెలుగుదేశంలో కన్పించడం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయముంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో భారీ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు ప్రస్తుతం అంత సులభంగా లేదు. అదే సమయంలోప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేనలు బలపడలేని పరిస్థితి కూడా ఉంది. అధికార, ప్రతిపక్షాల పరిస్థితి అలా ఉంటే..ఓటరు నాడి ఎలా ఉందనేది అంతుబట్టడం లేదు. ఓటరు నాడి అర్ధం కావాలంటే మరింత సమయం వేచి చూడాల్సిందే 


ఇంటి ముంగిట్లోనే అన్నీ


2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారనేది కాదనలేని సత్యం. ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ పథకాల డబ్బు నేరుగా లబ్దిదారుడి ఖాతాలోనే పడిపోతోంది. సంక్షేమ పథకాల విషయంలో అధికార పార్టీపై వేలెత్తి చూపే పరిస్థితి ప్రతిపక్షాలకు లేదనేది అందరికీ తెలిసిందే. మరోవైపు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయాలు, సంక్షేమ పథకాలు, నాడు నేడుతో ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మల్చడం, వైద్య విద్యకు పెద్దపీట ఇలా అన్నీ బాగానే ఉన్నాయి. 


అయినా ప్రభుత్వంపై వ్యతిరేకత


ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. ఎక్కడో ఏదో లోపం స్పష్టంగా కన్పిస్తోది. ప్రజల్లో ఏదోమూల అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, ద్రవ్యోల్బణం కావచ్చు లేదా ఇంధన ధరలు, గ్యాస్ ధరలు కావచ్చు. అన్నీ దారుణంగా పెరిగిపోతూ సామాన్యుడి నడ్డి విరుగుతోంది. ధరల పెరుగుదల అనేది వాస్తవానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమైనా..సామాన్యుడికి తక్షణం కన్పించేది రాష్ట్రంలో ప్రభుత్వమే. ఈ వ్యతిరేకతే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారవచ్చనే అంచనాలున్నాయి. 


ప్రభుత్వ వ్యతిరేకతకు కారణాలివే


దేశంలో అమాంతం పెరుగుతున్నఇంధన ధరలు, గ్యాస్ ధరలు, వంట నూనెల ధరలతో పాటు జీఎస్టీ పోటు ఇలా అన్నీ సామాన్యుడి సగటు జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇదంతా నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ప్రభావం చూపిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. దీనికి కారణం లేకపోలేదు. ధరల పెరుగుదలతో ప్రభావితమైన సగటు ఓటరుకి కేంద్రంలో ప్రభుత్వం కన్పించదు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంపైనే తన అసంతృప్తిని వెళ్లగక్కుతాడు. ఓటరులోని ఈ వైఖరే ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమౌతోంది. ధరల పెరుగుదలకు కారణం ఎవరనేది ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పడంలో అధికార పార్టీ వైఫల్యం చెందిందనే చెప్పాలి. 


ఏపీలో అభివృద్ధి లేకపోవడం మరో కారణం


ఏపీ అభివృద్ధి విషయంలో కాస్త వెనుకంజలో ఉందనే చెప్పాలి. ముఖ్యంగా రోడ్ల పరిస్థితి ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నా..ఏ పథకం రాని సగటు ఓటరుకు అభివృద్ధి లేకపోవడం, రోడ్ల దారుణ పరిస్థితి ప్రధాన లోపంగా కన్పిస్తుంది. ఫలితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ 2019 ఎన్నికలతో పోలిస్తే కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఆర్ధికంగా బలంగా లేకపోవడంతో సంక్షేమ పథకాలు తప్ప..అభివృద్ధి పనుల్లో పురోగతి కన్పించడం లేదు. 


తెలుగుదేశం, జనసేన పరిస్థితి ఏమిటి


సాధారణంగా ఎక్కడైనా సరే..కేంద్రమైనా, రాష్ట్రమైనా..ప్రతిపక్షం ఎప్పుడూ ప్రభుత్వ వ్యతిరేకతను ఆధారంగా చేసుకునే బలపడుతుంటుంది. కానీ ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత కన్పిస్తున్నా..అనుకూలంగా మల్చుకోవడంలో ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన విఫలమౌతున్నాయి. అధికార పార్టీపై పూర్తి స్థాయి పోరాటం చేయడంలో ప్రతిపక్షాలు రెండూ ఘోరంగా విఫలమవుతున్నాయి. ఎంతసేపూ తన అనుకూల మీడియాపైనే టీడీపీ ఆధారపడుతోంది. మీడియా ప్రభావం ఓట్లు రాల్చదన్న వాస్తవాన్ని గ్రహించలేకపోతోంది. తెలుగుదేశం పార్టీ పోరాటమంతా రాజధాని అంశానికే పరిమితమైంది. రాజధాని అంశంపై రాష్ట్రమంతా సానుకూలత లేదనే విషయం ప్రతిపక్షపార్టీలకు అర్ధం కావడం లేదు. టీడీపీలోని ఈ వైఖరి ఉత్తరాంధ్ర ఓటర్లను ఆ పార్టీకు దూరం చేసే పరిస్థితి లేకపోలేదు.


ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ పరిస్థితి 2019 ఎన్నికలకు ముందు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. ఎప్పుడో అడపా దడపా ప్రెస్‌మీట్స్, ఒకటి రెండ్రోజులు పర్యటించడం, సినిమా మేనరిజంతో డైలాగ్స్ తప్పించి మరేదీ లేదనే విమర్శలు వస్తున్నాయి. 


అందుకే ఏపీలో 2024 ఎన్నికలకు ఓటరు నాడి ఎటు ఉంటుందనేది ఆసక్తిగా మారింది. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చూపిస్తే అధికార పార్టీకు మరోసారి ఢోకా ఉండదు. ప్రభుత్వ వ్యతిరేకతను కేవలం రాజధాని అంశానికి పరిమితం చేయకుండా పోరాడితే ప్రతిపక్షం బలపడే అవకాశాలున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్షం రెండూ మారితేనే ఓటరు నాడి మారవచ్చు.


Also read: Unstoppable 2: వెన్నుపోటు ఎపిసోడ్ సమర్ధించేందుకే అన్ స్టాపబుల్ 2 ప్లాన్ చేశారా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook